NTV Telugu Site icon

Amit Shah: తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్‌కి అమిత్ షా కౌంటర్..

Amit Shah

Amit Shah

Amit Shah: పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు.

అయితే, స్టాలిన్ వ్యాఖ్యల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. తమిళనాడు ఒక్క పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోదని షా అన్నారు. ‘‘పునర్విభజన తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో స్పష్టం చేశారు’’ అని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి రూపొందించడం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి లోక్‌సభ స్థానాలు తగ్గవచ్చని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణకు కారణమైంది.

Read Also: Wasim Akram: ‘‘కోతులు కూడా అంత తినవు’’.. పాక్ ప్లేయర్లపై వసీం అక్రమ్ ఫైర్..

పార్లమెంట్‌లో తమిళనాడు ప్రాధాన్యత తగ్గుతుందని స్టాలిన్ అన్నారు. ఇది తమిళ నాడు హక్కులకు సంబంధించిన విషయమని, పార్టీలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన తమ రాష్ట్రానికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు.

ఇదెలా ఉంటే, మరోవైపు ‘‘త్రి భాషా విధానం’’పై కూడా డీఎంకే ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నాంటూ మండిపడుతోంది. అయితే, దీనిపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. డీఎంకే కార్యకర్తలు మోసుకెళ్లే కొన్ని పెయింట్ డబ్బాలు తప్పా, తమిళ ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు భాషల విధానంపై డీఎంకే వైఖరిని తిరస్కరించారని అన్నారు.