Site icon NTV Telugu

Tamil Nadu: 24 గంటల్లో రెండు రాజకీయ హత్యలు.. బీజేపీ కార్యకర్తని నరికి చంపిన దుండగులు..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యలు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. ఈ నెలలో బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని దుండగులు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పదవి నుంచి దిగిపోవాలని ఏఐడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేశాయి. ఇదిలా ఉంటే కడలూరు జిల్లాలో పళనిస్వామి పార్టీ ఏఐడీఎంకేకి చెందిన క్యార్తకర్తను నరికిచంపారు. పుదుచ్చేరి సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. పద్మనాభన్ అనే వ్యక్తి బైకుపై బాగూర్ వైపు వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు అతడిని నరికి చంపారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read Also: Astrologer: బైడెన్ తప్పుకుంటాడని చెప్పిన ఆస్ట్రాలజర్ జోస్యం నిజమైంది.. తదుపరి యూఎస్ అధ్యక్షుడు ఎవరంటే..?

ఇదిలా ఉండగా, 24 గంటల్లోనే మరో పార్టీకి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని శివగంగైలో బీజేపీ కార్యకర్తను దుండగులు నరికి చంపారు. శివగంగై బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఉన్న సెల్వకుమార్‌ తనకున్న ఇటుక బట్టీ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి, నరికి చంపారు. దారిలో వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న సెల్వకుమార్‌ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలోకి చేరేలోపే అతను మరణించాడు.

ఈ హత్యపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు సెల్వకుమార్‌ కుటుంబానికి సానూభూతి తెలియజేశారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమిళనాడు హత్యలకు రాజధానిగా మారిందని ఆయన ఆరోపించారు. నిందితులకు ప్రభుత్వం, పోలీసులు అన్నా భయం లేదని చెప్పారు. పోలీసులను తన ఆధీనంలో ఉంచుకుని ముఖ్యమంత్రి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. స్టాలిన్‌కి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు ఉందా.? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారినట్లు ఆరోపించారు. అయితే, ఈ హత్య రెండు వర్గాల మధ్య శత్రుత్వం కారణంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని శివగంగై ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు.

Exit mobile version