Site icon NTV Telugu

BJP-JDS Alliance: కాంగ్రెస్‌ని ఓడించడమే లక్ష్యం.. పొత్తుపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు..

Kumara Swamy

Kumara Swamy

BJP-JDS Alliance: కర్ణాటకలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బకు బీజేపీ, జేడీఎస్ పార్టీలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జేడీఎస్ ఎప్పుడూ లేని విధంగా విఫలమైంది. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తోంది. ఎప్పుడూ కింగ్ మేకర్ గా ఉన్న జేడీయూ ఈ సారి కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

Read Also: IND vs PAK Live Updates: 5 ఓవర్లలో భారత స్కోరు ఇలా.. దూకుడుగా గిల్

ఇదిలా ఉంటే బీజేపీ-జేడీఎస్ పొత్తుపై మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో, జేడీఎస్ పొత్తుపెట్టుకుందనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. చర్చలు ప్రాథమిక దశాల్లో ఉన్నాయని అన్నారు. ఇంకా వివరంగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని వ్యాఖ్యానించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు అని కుమారస్వామి అన్నారు. జేడీఎస్ మాండ్యా లోకసభ సీటు కోసం మొండిగా వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలను ఖండించారు. 2019లో ఈ స్థానం నుంచి బీజేపీ మద్దతుతో సినీనటి సుమలత గెలుపొందారు.

కుమారస్వామి మాట్లాడుతూ.. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా పాలిస్తుందో అంతా చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించటమే లక్ష్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని, ప్రజలు బీజేపీ-జేడీఎస్ పొత్తు కోరుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు పొత్తుపై కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తోంది. కాంగ్రెస్ నేత జగదీష్ షెట్టర్ మాట్లాడుతూ.. మీ సౌలభ్యం కోసం పొత్తులు పెట్టుకుంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. జేడీఎస్ కి ఎలాంటి సిద్ధాంతాలు లేవని, అధికారం కోసం ఏమైనా చేస్తుందని విమర్శించారు.

Exit mobile version