PM Modi: ఢిల్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార ఆప్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌తో ఢిల్లీ పోరు త్రిముఖ పోటీగా మారింది. ఇదిలా ఉంటే, బీజేపీ మాత్రం ఆప్‌ని, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. తాజాగా, ఢిల్లీలోని బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ‘‘మేరా బూత్ సబ్ సే మజ్‌బూత్’’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని బీజేపీ శ్రేణులకు ప్రధాని పిలుపునిచ్చారు.
Read Also: Farooq Abdullah: బంగ్లాదేశ్‌ని నిందించలేము.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా..
మురుగు నీరు, చెత్త కుప్పలు, కనీస సౌకర్యాలు లేని ప్రాంతాలను ఫోటోలు తీసి, వాటి లొకేషన్ షేర్ చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అతిపెద్ద లక్ష్యమని ప్రధాని అన్నారు. ‘‘ఆప్-ద’’ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇబ్బందులు, సమస్యల నుంచి ఢిల్లీని విముక్తం చేయాలని సూచించారు. ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దించినప్పుడే ఢిల్లీని అభివృద్ధి చెందిన రాజధానిగా చేయాలనే సంకల్పం నెరవేరుతుందని చెప్పారు. ప్రతీ బూత్‌లో మూడు నుంచి నాలుగు తరాల కార్యకర్తలు, ఢిల్లీలోని సంస్థాగత బలం ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని ఇస్తుందని తాను అనుకుంటున్నట్లు మోడీ చెప్పారు.
ఢిల్లీ ప్రజలు ఆప్ అబద్ధాలతో విసిగిపోయారని, మొదట కాంగ్రెస్, ఆ తర్వాత ఆప్ ఢిల్లీ ప్రజల్ని మోసం చేశాయని చెప్పారు. బీజేపీ మధ్యతరగతిని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించి, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుందని, విద్యా ఆరోగ్యం వరకు ప్రతీ ఆదునిక సౌకర్యాన్ని బీజేపీ సృష్టిస్తోందని చెప్పారు. ఈ ఆప్ ఢిల్లీలోని మధ్యతరగతి వర్గానికి సమస్యల్ని మాత్రమే ఇచ్చిందని దుయ్యబట్టారు. ఢిల్లీలోని ప్రతీ మూలకు మెట్రో ఉందని, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలతో కనెక్ట్ చేయబడిందని మోడీ చెప్పారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 08న ఓట్ల లెక్కింపు ఉంటుంది.