Taj Mahal: తాజ్‌మహల్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు

  • తాజ్‌మహల్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ
  • కేంద్రానికి, పురావస్తు శాఖకు నోటీసులు
  • అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశం
Taj Mahal

Taj Mahal

తాజ్‌మహల్ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ జరిపింది. తాజ్‌మహల్‌ను హిందూ దేవాలయంగా ప్రకటించాలా? వద్దా అన్న అంశంపై విచారించింది. ఈ సందర్భంగా తాజ్‌మహల్‌పై సర్వే జరపాలా? అనేదానిపై కేంద్రానికి, భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది. తాజ్‌మహల్‌పై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది.

2015లో ఆగ్రా సివిల్ కోర్టులో దాఖలైన డిక్లరేటరీ సూట్. ‘లార్డ్ శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగ్నాథేశ్వర్ విరాజ్‌మాన్ తేజో మహాలయ మందిర్’ తరఫున పిటిషనర్లు తాజ్‌మహల్ సముదాయాన్ని హిందూ ఆలయంగా గుర్తించాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను దిగువ కోర్టు కొట్టేసింది. ఈ అభ్యర్థనను ఆగ్రా ట్రయల్ కోర్టు తిరస్కరించింది. అనంతరం దాఖలైన రివిజన్ పిటిషన్‌ను కూడా అదనపు జిల్లా న్యాయమూర్తి నిర్వహణపరమైన కారణాలతో కొట్టివేశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో న్యాయమూర్తి రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ కేసును విచారిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఏఎస్‌ఐ తమ కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పంకజ్ కుమార్ వర్మకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక పిటిషనర్ల తరఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సీనియర్ న్యాయవాది హరి శంకర్ జైన్.. దిగువ కోర్టులు సర్వే అభ్యర్థనను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని వాదించారు. తాజ్‌మహల్ చారిత్రక స్వరూపాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే, ఫొటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి అని కోర్టుకు తెలిపారు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్లు తాజ్‌మహల్ ప్రాంగణంలో అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి సర్వే నిర్వహించడంతో పాటు ఫొటోగ్రాఫిక్, శాస్త్రీయ ఆధారాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే తాజా విచారణలో అలహాబాద్ హైకోర్టు తాజ్‌మహల్ ఆలయమా? కాదా? అనే అంశంపై ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వే అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం, ఏఎస్‌ఐ తమ అధికారిక వైఖరిని కోర్టుకు తెలియజేయాలని మాత్రమే ఆదేశించింది. దీంతో ఈ వివాదంలో న్యాయపరమైన ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది.