Operation Sindoor: జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపేశారు. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీసుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, ట్రైనింగ్ సెంటర్లపై భారత్ క్షిపణులతో విరుచుపడి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత, పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడికి ప్రయత్నిస్తే ధీటుగా జవాబు చెప్పింది. 11 పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. దీని తర్వాతే, పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది.
భారత వైమానిక దళం(IAF) దాడులతో పాకిస్తాన్ భయపడిందని, ఐఏఎఫ్ ఆధిపత్యంతోనే పాకిస్తాన్‌తో నాలుగు రోజుల యుద్ధం ముగిసిందని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సైనిక వ్యూహ పరిశోధన సంస్థ వెల్లడించింది. సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్స్పెక్టివ్ స్టడీస్(CHPM) ఈ అధ్యయనాన్ని విడుదల చేసింది. సైనిక చరిత్రకారుడు అడ్రియన్ ఫాంటనెల్లాజ్ రచించిన ఈ నివేదిక, 2025 మే 7 నుంచి 10 వరకు 88 గంటల పాటు భారత్-పాక్ వైమానిక యుద్ధంపై విశ్లేషణను అందించారు.
తొలి దశలో పాక్ ప్రతిదాడి:
ప్రారంభ దశలో పాకిస్తాన్ వైమానిక దళం (పీఏఎఫ్) తీవ్రంగా స్పందించిందని, సుమారు 60 భారత యుద్ధవిమానాలు, 40కి పైగా పాక్ యుద్ధ విమానాలు భారీ పోరాటంలో పాల్గొన్నాయని నివేదిక చెప్పింది. చైనీస్ తయారీ PL-15 ఎయిర్-టు-ఎయిర్ మిసైళ్లు, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ వ్యవస్థల సహాయంతో పాక్ కొంత మేరకు భారత్‌కు నష్టం కలిగించింది. ఈ దశను స్విట్జర్లాండ్ సంస్థ భారత్‌కు వ్యూహాత్మక తాత్కాలిక ఎదురుదెబ్బగా పేర్కొంది. భారత్ కనీసం ఒక రఫేల్ విమానాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. అయితే, తర్వాత దశలో భారత్ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థాపితంగా ధ్వంసం చేసి, యుద్ధాన్ని తన షరతుల మేరకు ముగించిందని నివేదిక స్పష్టం చేసింది.
విరుచుకుపడిన భారత్:
అయితే, నివేదిక మొదటి నష్టం యుద్ధాన్ని నిర్ణయించలేదని స్పష్టం చేసింది. తదుపరి రోజుల్లోం భారత్ వైమానిక దళం SEAD/DEAD ( శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థను అణిచివేయడం, ధ్వంసం చేయడం) వంటి వ్యూహాన్ని అమలు చేసింది. స్కాల్ప్, బ్రహ్మోస్ వంటి స్టాండ్ ఆఫ్ క్షిపణులతో పాక్ రాడార్ వ్యవస్థల్ని, సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ నెట్‌వర్క్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని నివేదిక వెల్లడించింది.
ఈ దాడులతో పాక్ వైమానిక రక్షణ బలహీనపడిన తర్వాత, భారత దళాలు పాక్ కీలక వ్యూహాత్మక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేశాయని, రన్ వేలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాక్ స్ట్రైక్ సామర్థ్యం తగ్గిపోయిందని చెప్పింది.
భారత వైమానిక రక్షణ అద్భుతం:
భారత్‌కు చెందిన IACCCS నెట్వర్క్, ఆర్మీ యొక్క ఆకాశ్‌తీర్ వ్యవస్థ, అలాగే ఆకాశ్, బారక్-8, S-400 వంటి బహుళస్థాయి క్షిపణి రక్షణ వ్యవస్థలు అత్యంత ప్రభావంగా పనిచేశాయని నివేదిక ప్రశంసించింది. ఇవి పాక్ ప్రతిదాడుల్ని సమర్థంగా అడ్డుకున్నాయని పేర్కొంది. ఆపరేషన్ కేవలం ప్రతీకార దాడులు మాత్రమే కాదని, భవిష్యత్తులు పాక్ కేంద్రంగా ఉగ్రవాద దాడులు జరిగితే ఇదే తీరుగా తీవ్రంగా స్పందిస్తామని భారత్ వార్నింగ్ ఇచ్చిందనే నివేదిక పేర్కొంది. తొలి రోజు పాక్‌కు వచ్చిన తాత్కాలిక లాభం తప్పితే, యుద్ధంలో భారత్ వైమానిక శక్తి ధాటిని పాక్ ఎదుర్కోలేకపోయిందని చెప్పింది.
కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్:
యుద్ధంతో తీవ్రంగా నష్టపోవడంతో పాకిస్తాన్, కాల్పుల విరమణ కోసం భారత్‌ను ప్రాధేయపడినట్లు నివేదిక చెప్పింది. మే 10 నాటికి పాక్ వైమానిక స్థావరాలు ఒత్తిడిలోకి వెళ్లాయని, వైమానిక రక్షణ సామర్థ్యాలు క్షీణించడంతో పాక్ తన గగనతలాన్ని కాపాడుకోలేని పరిస్థితికి చేరిందని చెప్పింది. అప్పటికే భారత వైమానిక దళం ఆధిపత్యం సాధించడంతో కాల్పుల విరమణ కోరిందని స్విస్ అధ్యయనం తేల్చింది.