Suvendu adhikari: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 294 స్థానాలు ఉన్న రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, తాము మరోసారి అధికారంలోకి వస్తామని అధికార టీఎంసీ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే, బుధవారం రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. బీజేపీ 180 స్థానాలకు పైగా గెలుస్తుందని చెప్పారు. ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మే 4న బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై 30,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుస్తానని సువేందు అధికారి పేర్కొన్నారు. మమతా బెనర్జీ ఇక విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. భవానీపూర్‌లో 90శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని, అధిక సంఖ్యలో హిందూ ఓటర్లు మార్పు కోరుతూ ఓటేశారని ఆయన చెప్పారు. బీజేపీ కార్యకర్తల కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మమతా బెనర్జీ స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలను, ఇతరుల్ని బెదిరించడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
