మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్‌గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఈరోజు.. రేపు అంటూ ఊరిస్తున్నారే తప్ప.. అధికారికంగా అభ్యర్థి పేరు మాత్రం ప్రకటించలేకపోతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ఎప్పుడో ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా మహాయుతి కూటమికి భారీ విజయం కూడా ఉంది. కానీ సీఎం పేరు అధికారికంగా ప్రకటించడానికి జంకుతున్నారు. భవిష్యత్ ముప్పును దృష్టిలో పెట్టుకుని ఏం జరగుతుందోనన్న ఆందోళనతోనే పేరు ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ భయపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సోమవారం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే షిండేకు అనారోగ్యం కారణంగా ముంబైలో జరగాల్సిన ఎన్డీఏ సమావేశం రద్దైంది. దీంతో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా పడింది. మరోవైపు మహారాష్ట్ర పంచాయితీ పరిష్కారం కోసం కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజారాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నియమింపబడ్డారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం పేరు ప్రకటించలేదు. తాజాగా డిసెంబర్ 4న ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు పేరు ప్రకటిస్తారని బీజేపీ నేత ఒకరు మీడియాకు వెళ్లడించారు. దీంతో మరికొన్ని గంటల పాటు సస్పెన్ష్ కొనసాగనుంది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు మహారాష్ట్ర విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది
ఇదిలా ఉంటే మళ్లీ తానే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని షిండే సన్నిహితుల దగ్గర అన్నారని సమాచారం. సామాన్యుడిగా ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృష్టి చేసినట్లు షిండే చెప్పుకొచ్చారు. అందుకోసం తిరిగి రావాలని ప్రజలు భావిస్తున్నారని షిండే చెప్పుకొచ్చినట్లు సమాచారం.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది.