Babri Masjid: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది. మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్‌లో శనివారం ఈ వ్యవహారం ఉద్రిక్తతల్ని పెంచింది. డిసెంబర్ 6, 1992న అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేశారు. ఇప్పుడు ఇదే తేదీ రోజు బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగింది.
Read Also: IndiGo CEO vs Central Govt: ఇండిగో సర్వీసుల్లో అంతరాయం.. సీఈవోపై వేటు పడేనా?
ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాకు చెందిన మత ప్రముఖులు వచ్చారు. ఖురాన్ పారాయణం తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. ‘‘నారా-ఏ-తక్బీర్’’, ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేశారు. బెల్దంగాలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దతుదారులు ఇటుకలు మోసుకువచ్చారు. మతపరమైన అల్లర్లను నివారించేందుకు రాష్ట్ర, కేంద్ర బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. 67 శాతం ముస్లిం జనాభా ఉన్న ముర్షిదాబాద్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ శంకుస్థాపనను పెద్ద ఎత్తు నిర్వహించారు. సుమారుగా 40,000 మంది అతిథులు, 20,000 మంది స్థానిక నివాసితుల కోసం షాహి బిర్యానీని ఏర్పాటు చేశారు. కేవలం ఆహారం కోసమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు హుమాయున్ కబీర్ చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హిందువుల ఓట్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని టీఎంసీ ఎమ్మెల్యే కబీర్‌ను సస్పెండ్ చేసింది. మరోవైపు, బీజేపీ కూడా టీఎంసీపై విరుచుకుపడుతోంది. ఈ వివాదం ఇప్పుడు కలకత్తా హైకోర్టుకు కూడా చేరింది. సీఎం మమతా బెనర్జీ మాత్రమ మసీదు నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కాంగ్రెస్, బీజేపీతో సంబంధాలు ఉన్న కబీర్ ఈ కర్యక్రమం ద్వారా అంతరాయం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆమె ఆరోపించారు.
