Suprem Court: మణిపూర్ హింసపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు మంగళవారం కూడా విచారణను కొనసాగించింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం మణిపూర్ పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలకొద్ది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్‌లు జరగలేదని.. విచారణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని వ్యాఖ్యానించింది. అసలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేది ఇలాగేనా? అంటూ మణిపూర్ పోలీస్ శాఖపై మండిపడింది. మణిపూర్ డీజీపీని వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. మణిపూర్‌లో శాంతి భద్రతల అనే మాటే లేదు. రాష్ట్ర యంత్రాగం పూర్తిగా విఫలమైంది. హింస చెలరేగి మూడు నెలలైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదు. అరెస్టులు జరగలేదు. విచారణలో అడుగడుగునా నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తోందంటూ మణిపూర్ పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.
Read also: Hyderabad Metro: ఓల్డ్ సిటీలో కొన్ని కారణాలతో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం
మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఆ రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. మహిళలపై జరిగిన ఈ ఘటన అత్యంత భయంకరమైందని.. అమానవీయకరమైందని పేర్కొంది. ఈ ఘటనలో మణిపూర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఘటన జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేందుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని మణిపూర్ పోలీసులను ప్రశ్నించింది. ఇప్పటివరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీసింది.
మే నుండి జులై చివరి వరకు రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైందని విచారణ సందర్భంగా సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 25, 2023 నాటికి 6496 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మణిపూర్ తరపున దాఖలు చేసిన నివేదిక పేర్కొంది. 11 ఎఫ్‌ఆఐర్‌లు మహిళలపై జరిగిన వేధింపుల ఘటనకు సంబంధించినవి పేర్కొన్నారు. అసలు వీటిలో ఎన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి? ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో గణనీయమైన లోపం కనిపిస్తోంది. కాబట్టి.. మణిపూర్ డీజీపీ శుక్రవారం(ఆగష్టు 4వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు ఈ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టుకు ఆయన సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి అని తెలిపింది.
Read also: GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. ఎంతో తెలుసా..!
ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేయడంతో.. సోమవారం(ఆగష్టు 7వ తేదీకి) మధ్యాహ్నానికి డీజీపీ హాజరు కావాలని ఆదేశాలను సవరించింది. సమగ్ర నివేదికతో తమ ముందుకు రావాలని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. ఎవరు బాధితుడు.. ఎవరు నేరస్తుడు అనేదాంతో సంబంధం లేదు.. ఎవరు నేరం చేసినా కోర్టు తీరు ఇలాగే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాధారణ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయబడిన తేదీ, సెక్షన్ 164 సిఆర్‌పిసి కింద స్టేట్‌మెంట్‌లు నమోదు చేయబడిన తేదీ, అరెస్టుల తేదీ.. మొత్తం అన్నింటితో స్టేట్‌మెంట్ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితుల్లో లేము కాబట్టి.. ఒక యంత్రాంగం అవసరమన్నారు. 6,500 ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తును సీబీఐకి అప్పగించడం అసాధ్యమన్న విషయంపై మాకు స్పష్టత ఉందన్న సీజేఐ.. అదే సమయంలో.. రాష్ట్ర పోలీసులకు అప్పగించబడదని స్పష్టం చేశారు. అందుకే.. ప్రభుత్వ పనితీరును పరిశీలించడం, పరిహారం, పునరుద్దరణ పనులు, దర్యాప్తు స్వతంత్ర్యంగా జరిగేలా చూడడం, స్టేట్‌మెంట్లు నమోదు చేయడం.. ఇలా అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది. మణిపూర్ లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయిందని సుప్రీం ధర్మాసం ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్ లో బాధితులకు సరైన సాయం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. బాధితులకు ఎటువంటి సాయం అందుతోందని ప్రశ్నించింది. మణిపూర్ లో స్కూల్స్, స్కూల్స్ లోని విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించింది. అలాగే మణిపూర్ లో మెడికల్ సెంటర్ల పరిస్థితి ఏమిటనీ.. ఏవిధంగా మెడికల్ సేవలను అందిస్తున్నారని సుప్రీం ధర్మాసనం ప్రశ్నిచింది.