Site icon NTV Telugu

Supreme Court: పిల్లల వ్యాక్సినేషన్ పై సుప్రీం కీలక తీర్పు

vaccination

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్‌ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు పేర్కొంది. పిల్లలకు టీకాతో ఎలాంటి ముప్పు లేదన్న విషయాన్ని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

“టీకా సురక్షిత, అనుబంధ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేటప్పుడు శాస్త్రీయంగా నిపుణుల్లో భిన్నాభిప్రాయాలుండొచ్చు. కానీ ప్రభుత్వ విధానాల ప్రాతిపదికన నిపుణుల అభిప్రాయంపై న్యాయస్థానం నిర్ణయం వెలువరించలేదు” అని ధర్మాసనం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌, సీడీసీ వంటి సాధికార సంస్థలు కూడా పిల్లల వ్యాక్సినేషన్‌ను సూచించినట్లు తెలిపింది. 15-18 ఏళ్ల వారికి ఇప్పటికే అందించిన టీకాలు, అనంతర విశ్లేషణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా కూడా వ్యాక్సిన్‌ వల్ల పిల్లలకు ఎలాంటి ముప్పు ఉండదనే చెబుతోందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

కోవిడ్ టీకాలకు సంబంధించిన ప్రయోగపరీక్షలు కూడా శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగానే సాగిన విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణించింది. పిల్లల వ్యాక్సినేషన్‌ విషయంలో జోక్యం చేసుకోవాలన్న పిటిషనర్‌ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఎన్‌టాగీ’ మాజీ సభ్యుడు డాక్టర్‌ జాకబ్‌ పులియెల్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈమేరకు తీర్పును వెలువరించింది.దీంతో పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో అపోహలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.

Rahul Gandhi Pub Video: వివాదంలో రాహుల్‌ నైట్‌క్లబ్‌ పార్టీ.. అసలు కారణమేంటి..?

Exit mobile version