Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..

Supreme Court Traffic

Supreme Court Traffic

Supreme Court: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఇ-చలాన్లు వస్తే చాలామంది పెద్దగా పట్టించుకోరు. నెలలు, ఏళ్లు గడిచినా జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాహనదారుల ఆటలకు చెక్ పెట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఊహించని సరికొత్త మార్గాన్ని తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు ఎగ్గొట్టే వారి నుంచి బకాయిలు వసూలు చేయాలంటే ఆ మొత్తాన్ని నేరుగా వారి ‘కరెంట్ బిల్లు’కు జత చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే పవర్ కనెక్షన్ కట్ అవుతుంది కాబట్టి, ఆ భయంతోనైనా చలాన్లు చెల్లిస్తారని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం లక్షలాది ఇ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని, వాటి ద్వారా పడిన ఫైన్లు వసూలు చేయడమే అసలైన సవాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా రూ.45,000 కోట్ల మేర ఇ-చలాన్ల జరిమానాలు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయని కోర్టు దృష్టికి వచ్చింది. మిగిలిన రూ.20,000 కోట్ల బకాయిల వసూలుకు వ్యవస్థాగతమైన కఠిన చర్యలు అవసరమని న్యాయమూర్తులు నొక్కిచెప్పారు.

ఈ క్రమంలోనే వాహనదారుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు మరికొన్ని కీలక సూచనలు చేసింది:

సర్టిఫికెట్లకు బ్రేక్: పెండింగ్ చలాన్లు పూర్తిగా క్లియర్ అయ్యేంత వరకు వాహన రిజిస్ట్రేషన్ పత్రాల పునరుద్ధరణ (RC Renewal), డూప్లికేట్ ఆర్సీల జారీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల మంజూరును తక్షణమే నిలిపివేయాలి.

బ్లాక్‌లిస్ట్ & సీజ్: బకాయిలు ఉన్న వాహనాలను ‘పరివాహన్’ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయడంతో పాటు, వాటి యాజమాన్య బదిలీని అడ్డుకోవాలి. అవసరమైతే అలాంటి వాహనాలను నేరుగా స్వాధీనం (సీజ్) చేసుకునే చర్యలు చేపట్టాలి.

లైసెన్స్ రద్దు & పొల్యూషన్ చెక్: నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేయాలని, కాలుష్య నియంత్రణ (PUC) ధ్రువపత్రాలు ఇచ్చే కేంద్రాలు కూడా చలాన్ క్లియరెన్స్ లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని స్పష్టం చేసింది.

ఈ విధానాలు అమల్లోకి వస్తే, ఇన్నాళ్లూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి చలాన్లను లైట్ తీసుకున్న వారి జేబులకు చిల్లు పడటంతో పాటు ఇళ్లల్లో చీకట్లు ముసిరే పరిస్థితి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.