మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శరద్‌పవార్ నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గడియారం గుర్తు తమకే కేటాయించాలంటూ శరద్‌పవార్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం దీనిపై విచారించిన న్యాయస్థానం భారీ షాకిచ్చింది. గడియారం గుర్తు అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకే కొనసాగించాలని న్యాయస్థానం తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Underwater Wedding: సాహసోపేత వివాహం.. ఏకంగా సముద్రం అడుగున జంట పెళ్లి..
అజిత్ పవార్ వర్గం గత ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, శరద్ పవార్ వర్గానికి నష్టం వాటిల్లకుండా చిహ్నాన్ని ఉపయోగించాలని తెలిపింది. ఈ విషయంలో కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే సుమోటోగా స్వీకరించి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.
2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అధికార మహాయుతి కూటమిలో చేరారు. పార్టీలో చీలిక తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అంతేకాకుండా ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు గడియారంను కూడా వారికే కేటాయించింది. తాజాగా మరోసారి న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి, అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Pushpa 2 The Rule: మెగా ఫ్యామిలీతో విభేదాలు.. పుష్ప 2పై ప్రభావం చూపిస్తాయా ?