Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి. ఇప్పటికే జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటైంది’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తివారీకి తెలిపారు. అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీకి కోర్టు సూచించింది. యూపీ ప్రభుత్వం తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌తగి.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరుగుతోందని ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టులో దాఖలైని ఇలాంటి పిటిషన్‌ని ఎత్తిచూపారు.
Read Also: Maruti e Vitara : మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ షురూ..టోకెన్ అమౌంట్ ఎంత కట్టాలో తెలుసా ?
రిటైర్డ్ జడ్జి హర్ష్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఈ సంఘటనపై న్యాయ విచారణ జరుపుతోంది. మాజీ పోలీస్ చీఫ్ వీకే గుప్తా మరియు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ డికె సింగ్ ఈ ప్యానెల్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేక పోలీస్ దర్యాప్తుకు ఆదేశించారు. జనవరి 29న,మౌని అమావాస్య రోజున పుణ్య స్నానాలకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీనిని నివారించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. పరిపాలనలో లోపాలున్నాయని, ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.