Site icon NTV Telugu

Supreme Court: హిజాబ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కామన్ డ్రెస్ కోడ్.. సుప్రీంకోర్టు ఏమందంటే..?

Supreme Court

Supreme Court

Supreme Court: దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్‌ డ్రెస్‌ కోడ్‌ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని స్కూళ్లు, కాలేజీలలో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణను నిరాకరించింది. దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్‌ కోడ్‌ అవసరమంటూ నిఖిల్‌ ఉపాధ్యాయ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Read Also: Saudi Arabia: వీడు మామూలోడు కాదు.. 43 ఏళ్లలో 53 సార్లు పెళ్లి చేసుకున్నాడు.

పాఠశాలలు, విద్యా సంస్థల్లో లౌకికతత్వాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా కామన్ డ్రెస్ కోడ్ అవసరమని పిటిషనర్ పేర్కొన్నారు. విద్యాసంస్థల లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కామన్ డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టడం చాలా అవసరమని.. లేకుంటే రేపటి రోజున నాగ సాధువులు కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చని.. అప్పుడు తమ అవసరమైన మతపరమైన ఆచారాలను ఉద‌హ‌రిస్తూ బట్టలు లేకుండా తరగతికి హాజరు కావచ్చని పిటిషనర్ వివరించారు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశమని, విద్యా హక్కు చట్టం కింద ఈ అంశానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎస్‌.ధులియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. అయితే ఇది కోర్టుకు రావాల్సిన అంశమే కాదని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకోలేమంటూ విచారణకు నిరాకరించింది. కాగా కర్ణాటకలో ఇటీవల వెలుగులోకి వ‌చ్చిన హిజాబ్ వివాదం నేపథ్యంలోనే పిటిషనర్ ఈ పిల్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version