Site icon NTV Telugu

Supreme Court: పంట వ్యర్థాలు తగలబెట్టడంపై విచారణ.. కేంద్రంపై సుప్రీం సీరియస్

Sc

Sc

Supreme Court: చలికాలం సమీపిస్తుందంటే చాలు.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ చట్టాలు ఉన్నప్పటికి ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాయని వ్యాఖ్యానించింది. అలాగే, పంట వ్యర్థాలను తగలబెట్టే వారిపై కఠిన చర్యలకు సంబంధించి కొత్త నిబంధనలను 10 రోజుల్లో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Maharashtra NCP: 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ

ఇక, ఇటీవల గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ విఫలం కావడంపై కూడా అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా వేయలేదని మండిపడింది. ఏటా ఈ సమస్యను చూస్తుంటే సీఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది.. కమిటీలు ఏర్పాటు చేశారా? చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా చూపించండి అని ప్రశ్నించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే మిగిలినట్లు కనబడుతున్నాయని సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. కేవలం మీరు మౌన ప్రేక్షకులుగానే మిగిలిపోయారని మండిపడింది.

Exit mobile version