కనుమ పండుగ రోజున మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఫిబ్రవరి 14 వరకు పూజా ఖేద్కర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌లు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
గతేడాది పూజా ఖేద్కర్ ఉద్యోగం పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్న్నారు. పూణెలో ట్రైనీ ఐఏఎస్‌గా పని చేస్తున్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు సౌకర్యాలు ఏమీ ఉండవు. కానీ ఆమె మాత్రం తన తండ్రితో కలిసి అధికారుల్ని బెదిరించి.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. సకల మర్యాదలు, సౌకర్యాలు కల్పించాలంటూ సిబ్బందికి హుకుం జారీ చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అనంతరం పూణె నుంచి ట్రాన్స్‌పర్ అయింది. అప్పుడే ఆమె బండారం బయటపడింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా నిజమని తేలింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లుగా తేలింది. ఓబీసీ, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేసినట్లుగా బయటపడింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం సంపాదించడంతో ఆమె సర్వీసును యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది. ఇక ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో.. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును పూజా ఖేద్కర్ ఆశ్రయించింది. కానీ కోర్టు మాత్రం చీవాట్లు పెట్టింది. దేశం మొత్తాన్ని మోసం చేశారంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఫిబ్రవరి 14 వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.