Supreme Court: కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం విధించడం వల్ల ఎంత మంది చదువు మానేశారో తెలియజేసే ప్రామాణిక లెక్కలు ఉన్నాయా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వాటిని తమకు నివేదించాలని సూచించింది. కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాల ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది.
పిటిషనర్లలో ఒకరు విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు పాఠశాలకు హాజరు కావట్లేదనే సమస్యను లేవనెత్తారు. పిటిషనర్లలో ఒకరి తరపున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ ఒక నివేదికను ప్రస్తావించారు. దానిలో చాలా మంది విద్యార్థుల సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. “ఈ ప్రత్యేక తీర్పు తర్వాత 17,000 మంది విద్యార్థులు నిజంగా పరీక్షలకు దూరంగా ఉన్నారని నా స్నేహితుడు (న్యాయవాదులలో ఒకరు) నాకు తెలియజేసారు” అని నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనానికి న్యాయవాది హుజెఫా అహ్మదీ చెప్పారు. ఇన్నాళ్లూ పాఠశాలల్లో లౌకిక విద్యను అభ్యసించిన బాలికలు.. హిజాబ్‌పై నిషేధం కారణంగా మళ్లీ మదర్సాలకు వెళ్లే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
SCO Summit: ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు నేడే ప్రారంభం.. ఒకే వేదికపై మోదీ, పుతిన్, జిన్‌పింగ్
మరో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదిస్తూ.. హిజాబ్ ధరించిన వ్యక్తికి మతం, లింగం ఆధారంగా వివక్ష చూపరాదని ఈ కేసులో అత్యంత ముఖ్యమైన భాగమని వాదించారు. భారతదేశం అంతటా, మొత్తం ప్రపంచంలో, అది ఇస్లామిక్ రాజ్యమైనా లేదా మరేదైనా హిజాబ్ చెల్లుబాటు అయ్యేదిగా గుర్తించబడుతుందని న్యాయవాది రాజీవ్ ధావన్ వాదించారు. విశ్వాసం సిద్ధాంతాల ప్రకారం, ఏదైనా ఒక నిర్దిష్ట మార్గంలో జరిగితే, అది చిత్తశుద్ధితో ఉంటే, దానిని అనుసరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం సంరక్షించదగిన మతపరమైన ఆచారంలో హిజాబ్ ధరించడం ఒక భాగం కాదని మార్చి 15న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.