Supreme Court: తమిళనాడు మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్(దీపస్తంభం) వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, నవంబర్ 24న కొన్ని షరతులకు లోబడి ఒకసారి దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మధ్యంతర అనుమతిని అక్కడ దీపాలు వెలిగించే ఏదైనా దీర్ఘకాలిక సంప్రదాయానికి తుది ఆమోదంగా భావించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీపం వెలిగించే కార్యక్రమానికి పరిమిత సభ్యులకే అనుమతి ఇచ్చింది. ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులతో కూడి పరిమిత బృందం మాత్రమే పాల్గొనాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాధారణ ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఉండదు. ఎంత మంది ఉండాలి, ఎవరెవరు పాల్గొనాలి అనే విషయాలు నిర్ణయించే బాధ్యత మదురై జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. దీపారాధన కార్యక్రమ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత మొత్తం కలెక్టర్‌దే అని కోర్టు పేర్కొంది. భద్రత కోసం పోలీసుల్ని మోహరించాలని ఆదేశించింది. అవసరమైతే సీఆర్పీఎఫ్ సేవలు ఉపయోగించుకోవాలని తెలిపింది. కొండపై ఉన్న దర్గా, మసీదులో ప్రార్థనలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటి ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపింది.
గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు..
తిరుప్పరంకుండ్రం కొండపై దర్గా సమీపంలో దీపాలు వెలిగించే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. 2025 డిసెంబర్లో తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కొండపై ఉన్న దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు భక్తులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆచారాన్ని నిర్వహించేందుకు ఆలయానికి చారిత్రక హక్కు ఉందనే వాదనను హైకోర్టు సమర్థించింది.
వివాదం ఏమిటి?
సుబ్రమణ్య స్వామి ఆలయం ఉన్న కొండపైనే హజరత్ సుల్తాన్ సికిందన్ బదుషా అవులియా దర్గా ఉంది. దీని వల్ల ఆలయం వద్ద దీపం వెలిగిస్తే మత పరమైన ఇబ్బందులు ఏర్పడి, రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతింటుందని అప్పటి డీఎంకే ప్రభుత్వం, ఆలయ యాజమాన్యం సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేశాయి. దీని తర్వాత దీప స్తంభం ఉన్న ప్రాంతం సుబ్రహణ్య స్వామి ఆలయానిదే అని, ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీని తర్వాత హైకోర్టు తీర్పుపై విజయ్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కార్తీక దీపానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి కొండపై ఉన్న ఆలయం 6వ శతాబ్ధానికి చెందినది కాగా, దర్గా 14వ శతాబ్ధానికి చెందినది.

