మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని స్పష్టం చేసింది. ఇలాంటి వాతావరణం వల్ల అడవుల్లో కార్చిచ్చు అంటుకునే అవకాశాలూ ఉన్నాయని, దీంతో అటవీ శాఖనూ అప్రమత్తం చేస్తున్నామని వాతావరణ శాఖ వివరించింది.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం 41 డిగ్రీలకు మించి ఉష్ణోత్రలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఏకంగా 122 ఏళ్ల తర్వాత దేశంలో గత నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత ఈ మార్చిలో సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది. ఈ ఎండల ప్రభావం ఏప్రిల్‌లోనూ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బయటకు వెళ్లకుండా ఉండడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
