పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ తో శిరోమణి అకాలీ దళ్ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కరోనా పేషెంట్ల కోసం తెచ్చిన మెడికల్ కిట్లు, కరోనా వ్యాక్సిన్లను ప్రైవేటుకు అమ్ముకోవడం వంటి ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం అమరీందర్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనేక స్కాములు, కుంభకోణాలకు అమరీందర్ సింగ్ ప్రభుత్వం పాల్పడుతుందని సుక్బీర్ సింగ్ బాదల్ విమర్శించారు.