గత కొద్దిరోజులుగా చక్కెర ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఏకంగా కిలో షుగర్ ధర రూ.65కి పైగా పెరిగిపోయింది. అంతేకాకుండా చక్కెర నిల్వలు కూడా తగ్గిపోయాయి. దీంతో పంచదార ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అప్రమత్తమై దిగుమతులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కొనుగోలుదారులు లబోదిబో అంటున్నారు. ఇలాంటి తరుణంలో శుభవార్త అందింది.
తాజాగా ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) అధ్యక్షుడు నీరజ్ షిర్గావ్కర్ కీలక ప్రకటన చేశారు. దేశంలో చక్కెరకు ఎలాంటి కొరత లేదని, ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు పెరగడానికి ఊహాగానాల ఆధారంగా నిల్వలు చేయడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గడం వంటి అంశాలే కారణమని చెప్పారు. రానున్న కొద్ది రోజుల్లో చక్కెర ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలో చక్కెర సరఫరా పరిస్థితి ప్రాథమికంగా బలంగానే ఉందని షిర్గావ్కర్ చెప్పారు. పండుగల సమయంలో పెరిగే డిమాండ్‌ను తీర్చేందుకు సరిపడా చక్కెర నిల్వలు, సరఫరా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇటీవల దేశంలో చక్కెర ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల్లోనే రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు దాదాపు 24 శాతం పెరిగి కిలో రూ.56-60 స్థాయికి చేరాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 20న గరిష్ఠంగా 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక ఆగస్టు 20, 2026 వరకు అడ్వాన్స్‌డ్ ఆథరైజేషన్ స్కీమ్ కింద దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను ఒకేసారి టారిఫ్ రేట్ కోటా మార్గంలోకి మార్చుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. అయితే దిగుమతి చేసుకున్న ముడి చక్కెరతో తయారు చేసే శుద్ధి చేసిన చక్కెరను 2026 అక్టోబర్ చివరి నాటికి దేశీయ మార్కెట్‌లోనే విక్రయించాలి అనే నిబంధన విధించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిర్దేశిత హెచ్ఎస్ కోడ్ కింద సుమారు 4 లక్షల టన్నుల ముడి చక్కెర ఇప్పటికే దిగుమతి అయింది.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ (NFCSF) అధ్యక్షుడు ప్రకాశ్ నాయక్‌నవారే కూడా దేశీయ మార్కెట్‌లో చక్కెర సరఫరా తగినంతగా ఉందని తెలిపారు. 2025-26 సీజన్‌లో దేశ చక్కెర ఉత్పత్తి అంచనాను 279 లక్షల టన్నులుగా ఫెడరేషన్ కొనసాగించింది. ఇందులో ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించే సుమారు 24 లక్షల టన్నుల చక్కెరను పరిగణనలోకి తీసుకోలేదు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2026-27 సీజన్‌కు ప్రారంభ నిల్వలు సుమారు 35 లక్షల టన్నులు ఉంటాయని అంచనా వేసింది. దేశంలో నెలకు సగటున 22 లక్షల టన్నుల చక్కెర వినియోగం ఉంటుందని నాయక్‌నవారే తెలిపారు. నవంబర్ నాటికి 15-20 లక్షల టన్నుల వరకు చక్కెర నిల్వగా ఉండే అవకాశం ఉందని, అదే సమయంలో ముందస్తు చెరకు క్రషింగ్ ప్రారంభమై కొత్త సరఫరాలు మార్కెట్‌లోకి వస్తాయని వివరించారు.
బ్రెజిల్ నుంచే దిగుమతులు
కొన్ని చక్కెర సరుకులు అక్టోబర్ 15కు ముందే భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నాయక్‌నవారే తెలిపారు. అయితే ఎంత పరిమాణంలో దిగుమతులు వస్తాయో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. ప్రస్తుతం భారత్‌కు చక్కెరను ఎగుమతి చేయగల ప్రధాన దేశంగా బ్రెజిల్ మాత్రమే ఉందని ఆయన చెప్పారు. థాయ్‌లాండ్‌లోనే చక్కెర కొరత ఉండటంతో అక్కడి నుంచి దిగుమతులు సాధ్యం కావడం లేదని వివరించారు. దిగుమతుల సమయం డీజీఎఫ్‌టీ అనుమతులు, కేటాయింపులు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ జారీ, షిప్‌మెంట్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అక్టోబర్ 31 గడువు తర్వాత భారత్‌కు చేరుకునే మార్గంలో ఉన్న చక్కెర సరుకులకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని నాయక్‌నవారే అభిప్రాయపడ్డారు. మొత్తంగా దేశంలో చక్కెర నిల్వలు, సరఫరా పరిస్థితి బలంగానే ఉండటంతో.. ప్రస్తుతం కనిపిస్తున్న ధరల పెరుగుదల తాత్కాలికమేనని, త్వరలోనే చక్కెర ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

