Sufi Council Slams Bilawal Bhutto Remarks On PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు భారతదేశంతో ఆగ్రహజ్వాలలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతోంది. ఢిల్లీలోని పాక్ ఎంబసీ ముందు బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉంటే బిలావల్ భుట్టోపై ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ నసీరుద్దీన్ చిస్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో వ్యాఖ్యలను ఖండించారు. బిలావల్ భుట్టో ఉపయోగించిన భాష ఆయన హోదాతో పాటు పాకిస్తాన్ పరువును దిగజార్చిందని అన్నారు. మన ప్రధాని, మన మాతృభూమిపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన విషపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నసీరుద్దీన్ చిస్తీ ప్రకటించారు.
Read Also: Delhi: భార్యతో గొడవ.. 2 ఏళ్ల కొడుకును బిల్డింగ్ నుంచి తోసేసిన తండ్రి..
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చనిపోలేదని.. పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణలో ఉన్న సమయంలో అమెరికన్ దళాలు చంపేశాయని గుర్తు చేశారు. భారత ముస్లింలు పాకిస్తాన్ ముస్లిం కన్నా సురక్షితంగా, మెరుగైన స్థితిలో ఉన్నారని ఇది పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని సూచించారు. బిలావల్ భుట్టో తన అస్థిర దేశాన్ని భారతదేశంతో పోల్చుకోవద్దని.. భారత రాజ్యాంగం అందరికి మత స్వేచ్ఛను కల్పించిందని అన్నారు. ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్ అనేది దేశంలోని వివిధ దర్గాల ఆధ్యాత్మిక అధిపతుల సంఘం.
ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఉగ్రవాదులకు, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ సహాయం చేస్తుందని విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలకు బదులుగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. లాడెన్ అయితే చనిపోయాడు కానీ.. గుజరాత్ కసాయి ఉన్నాడంటూ ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అయ్యేంత వరకు అమెరికా ప్రధాని మోదీని నిషేధించిందని.. ఆర్ఎస్ఎస్ ప్రధాని అని, ఆర్ఎస్ఎస్ సంస్థకు హిట్లర్ స్ఫూర్తి అని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై భారతవిదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ మరింత దిగజారిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.