Tej Pratap Yadav: బీహార్ ఎన్నికల ముందు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ నుంచి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ని 6 ఏళ్లు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ నేత, లాలూ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ సమర్థించారు. ఈ వివాదంపై తేజస్వీ మాట్లాడుతూ.. తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్దవాడని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు ఉందని అన్నారు. కానీ తన సోదరుడి బహిష్కరణపై అతని తండ్రి నిర్ణయం నిలుస్తుందని, పార్టీ ఇలాంటి వాటిని సహించదని అన్నారు. మరోవైపు, బీజేపీ, జేడీయూలు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.
శనివారం, తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రేమ, ప్రియురాలు గురించి ఓ ఫేస్‌బుక్ పోస్టులో పంచుకోవడం వివాదాస్పదమైంది. అనుష్క యాదవ్‌గా చెప్పబడుతున్న అమ్మాయితో తాను 12 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని, రిలేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ తర్వాత తన ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయిందని తేజ్ ప్రతాప్ చెప్పారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ 2018లో బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే వీరిద్దరు విడిపోయారు. అనుష్క యాదవ్‌తో 12 ఏళ్లుగా ప్రేమలో ఉంటే ఐశ్వర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నారని బీజేపీ, జేడీయూ నేతలు ప్రశ్నిస్తున్నారు. తేజ్ ప్రతాప్ ఇద్దరు అమ్మాయిల జీవితాలను నాశనం చేశారని విమర్శిస్తున్నారు. ఆ సమయంలో రాజకీయ కారణాలు, ఇతర సమీకరణాల్లో భాగంగా, కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే తేజ్ ప్రతాప్ ఈ వివాహానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు దీనిపై బీజేపీ, జేడీయూలు లాలూ ఫ్యామిలీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్, నైతిక విలువలు విస్మరించిందుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తేజస్వీ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇందులో ‘‘మేము ఇలాంటి వాటిని సహించలేము. మేము బీహార్ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్నాము’’ అని పోస్ట్ చేశారు. “నా అన్నయ్య గురించి అయితే, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం వేరు. ఆయనకు తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది… మా పార్టీ అధినేత స్పష్టం చేశారు” అని ఆయన అన్నారు.
