India Russia: భారత్, రష్యాతో మరో బిగ్ డీల్‌కి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ రష్యా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్తాన్‌ని కాళ్ల బేరానికి తెచ్చాయి. 2018లో, భారతదేశం రష్యాతో 5 యూనిట్ల S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం రూ. 35 వేల కోట్లకు అంటే 5.4 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇప్పటికే మూడింటిని రష్యా డెలివరీ చేసింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో 2-యూనిట్ల డెలివరీ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ రష్యాకు వెళ్తున్నారని తెలుస్తోంది.
అయితే, ఇదే కాకండా మరో బిగ్ డిఫెన్స్ డీల్‌పై కూడా భారత్, రష్యాతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుఖోయ్ SU-57 స్టెల్త్ ఫైటర్ జెట్ కొనుగోలుపై చర్చలు జరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. SU-57 స్టెల్త్ ఫైటర్ జెట్ ఐదో తరం జెట్. ప్రస్తుతం, భారత్ వద్ద ఐదోతరం జెట్స్ లేవు. ఇప్పుడున్న రాఫెల్ 4.5 జనరేషన్‌కి చెందినది. ప్రస్తుతం, చైనా J-35A ఐదవ తరం యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్‌కు రష్యా SU-57 జెట్‌ని ఆఫర్ చేసింది. జెట్‌తో పాటు మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద భారత్‌లోనే తయారీతో పాటు, సాంకేతికత బదిలీ కూడా చేస్తామని చెబుతోందని సమాచారం.
Read Also: Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి.. 13 మంది మృతి..
అయితే, ఈ డీల్‌పై అధికారిక సమాచారం లేనప్పటికీ అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు భారత్‌కి సాంకేతిక బదిలీపై కొర్రీలు పెడుతున్నాయి. రాఫెల్ యుద్ధవిమానానికి సంబంధించి ‘‘సోర్స్ కోడ్’’ ఇచ్చేందుకు ఇటీవల ఫ్రాన్స్ నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోర్స్ కోడ్ ఇవ్వడం ద్వారా ఫైటర్ జెట్స్ అప్‌గ్రేడ్‌తో సహా, ఇతర స్వదేశీ ఆయుధాలను అమర్చే వెసులుబాటు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే భారత ఆయుధాలను రాఫెల్ విమానంలో అమర్చవచ్చు. ఈ నేపథ్యంలోనే రష్యా ఆఫర్ చేస్తున్నట్లు SU-57 యుద్ధవిమానాన్ని కొనుగోలు చేస్తే, సాంకేతికత కూడా భారత్‌కి బదిలీ అవుతుంది. 5వ తరం జెట్స్ సాంకేతికత భారత్ వద్ద ఉన్నట్లు అవుతుంది.
అయితే, ఇక్కడ మరో ప్రధానమైన విషయం ఏంటంటే రష్యా నుంచి SU-57ని కొనకుండా అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు భారత్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. తమ మార్కెట్ పడిపోతుందని భయం వాటిలో ఉంటుంది. ఈ ఏడాది మోడీ అమెరికా పర్యటనలో ఎఫ్-35 ఫైటర్ జెట్‌ని ఆఫర్ చేశారు. అయితే, దీన్ని తయారు చేస్తున్న లాక్ హీడ్ మార్టిన్ మాత్రం మేక్ ఇన్ ఇండియా, సాంకేతిక బదిలీపై మాత్రం ఏం చెప్పడం లేదు. ఒకవేళ భారత్ రష్యా నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే, అమెరికా ‘‘కాట్సా’’ ప్రకారం ఆంక్షలు విధిస్తామని బెదిరించే అవకాశం ఉంది.