Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం రోజు హల్ద్వానీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మదర్సాని అధికారులు కూల్చేశారు. ఈ ఘటన తర్వాత కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వాహనాలతో పాటు ఇతర ప్రాంతాలకు నిప్పు పెట్టారు.
పరిస్థితి తీవ్రతరం అవుతున్న దృష్ట్యా హల్ద్వానీకి అదనపు బలగాలను రప్పించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులతో సమావేశానికి పిలుపునిచ్చారు. హల్ద్వానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గురువారం బంభుల్‌పురా పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమంగా నిర్వహించిన మదర్సా కూల్చేశారు. ప్రతీకారంగా.. సమీపంలోని కొంతమంది గుంపు పోలీస్ అధికారుల వాహనాలపై రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ని తగలబెట్టారు.
అల్లర్ల దృష్ట్యా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హల్వానీలోని బంభుల్‌పురాలో షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు, శుక్రవారం హల్ద్వానీలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అల్లర్ల నేపథ్యంలో డీజీపీ, చీఫ్ సెక్రటరీలతో సీఎం ధామి సమావేశమయ్యారు. బంబుల్‌పురాలో కర్ఫ్యూ విధించారు. కోర్టు ఆదేశాలతో ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు వెళ్లారని, ఆ సమయంలో సంఘవిద్రోహ శక్తులు పోలీసులు, ఇతర అధికారులపై దాడి చేశారని సీఎం చెప్పారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.