MK Stalin: తమిళనాడు రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అయితే, డీలిమిటేషన్ గురించి తమిళ ప్రజల భయాలను తొలగించడానికి ప్రధాని మోడీ నుంచి హామీ కావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సీట్ల వాటా శాతం మారకుండా కసరత్తు చేయాలని కోరారు.
Read Also: Bengaluru: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన భర్త..
‘‘ తమిళనాడు, జనాభా పెరుగుదలను నియంత్రించిన ఇతర రాష్ట్రాలు రాబోయే డీలిమిటేషన్ కసరత్తులో శిక్షించబడవని, తమిళ గడ్డపై నిలబడి, ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇవ్వాలి. పార్లమెంటరీ సీట్ల శాతం పరంగా తగ్గవని హామీ ఇవ్వాలి’’ అని స్టాలిన్ అన్నారు. ‘‘గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళ ప్రజల్లో భయాలను తొలగించాలి. న్యాయపరమైన డీలిమిటేషన్ కోసం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయడమే ఏకైక మార్గం. ఆయన చర్య తీసుకుంటారని నేను హృదయపూర్వకంగా ఆవిస్తున్నాను’’ అని స్టాలిన్ కోరారు.
తమిళనాడులో రాజకీయ పార్టీలు 1971 జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో తగ్గుతుందని స్టాలిన్ చెబుతున్నారు.