Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
ఇప్పటికీ, డీఎంకే అధినేత స్టాలిన్ వైపు ఎక్కువ మంది ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. 18 శాతం మంది తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, విజయ్ అప్రూవల్ రేటింగ్‌లో స్టాలిన్‌కి పోటీ ఇస్తున్నారు. సీఎం ఛాయిస్‌లో స్టాలిన్ మొదటి స్థానంలో ఉండగా, విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు, ప్రతిపక్ష అన్నాడీఎంకే కార్యదర్శ ఎడప్పాడి పళని స్వామికి 10 శాతం మంది మద్దతుతో మూడోస్థానంలో, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై 9 శాతంతో సీఎం ఎంపికగా ఉన్నారు.
Read Also: L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
తమిళ ప్రభుత్వ పనితీరుపై 15 శాతం మంది ‘‘చాలా సంతృప్తి వ్యక్తం చేశారు’’, 36 శాతం మంది ‘‘కొంత వరకు సంతృప్తి చెందారు’’, 25 శాతం మంది ‘‘అసంతృప్తి’’ వ్యక్తం చేశారు. 24 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎంకే స్టాలిన్ వ్యక్తిగత పనితీరుపై 22 శాతం మంది ప్రతివాదులు ‘‘చాలా సంతృప్తి’’ వ్యక్తం చేయగా, 33 శాతం మంది పర్వాలేదని, 22 శాతం మంది అస్సలు బాగోలేదని చెప్పారు. 23 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఆయన పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ప్రతిపక్ష నాయకుడు పళని స్వామి పనితీరుపై సర్వేలో పాల్గొన్న వారిలో 8 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా, 27 శాతం కొంత వరకు సంతృప్తి వ్యక్తం చేశారు. 32 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 33 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఓట్లను ప్రభావితం చేసే అంశాల్లో 15 శాతం మంది ‘‘మహిళా భద్రత’’ను హైలెట్ చేశారు. 12 శాతం మంది ధరల పెరుగుదల, 10 శాతం మంది మాదకద్రవ్యాలు, మద్యం దుర్వినియోగం వంటి కీలక సమస్యగా చెప్పారు. నిరుద్యోగమని 8 శాతం మంది చెప్పారు.