Sri Ram Sene Leader Injured After Being Shot: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బెలగావిలో శ్రీరామ్ సేన నేతపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. హిందాల్గా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరామ్ సేన జిల్లా అధ్యక్షుడు రవికుమార్ కోకిట్కర్ తుపాకీతో కాల్పులు జరిపారు. శ్రీరామ్‌సేన కార్యకర్తలు హిందుత్వం కోసం నిలబడతారని, ఇలాంటి దాడులకు భయపడబోమని ఆ సంస్థ చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఈ ఘటనను ఖండించారు.
Read Also: Minister Roja: పవన్‌కు మంత్రి రోజా ప్రశ్న.. ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా?
శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కోకిట్కర్ తన డ్రైవర్ మనోజ్ దేసూర్కర్, మరో ఇద్దరు కారులో బెలగావి నగరం నుండి హిందాల్గాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కారు స్పీడ్ బ్రేకర్ రావడంతో వేగం తగ్గించిన సమయంలో మోటార్ బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు సమీపంలోకి రాగానే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కోకిట్కర్, అతని డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బెలగావి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిందూత్వ పక్షాన నిలబడే సంస్థ, కార్యకర్తలు ఇలాంటి తూటాలకు, ఆయుధాలకు భయపడబోరని శ్రీరామ్‌సేన అధినేత ముతాలిక్ అన్నారు.
గతంలో కూడా కొంతమంది దుండగులు బీజేపీ, బీజేవైఎం, ఆర్ఎస్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ దాడులు చేశారు. కొంతమంది మరణించారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యకర్తలే దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జూలై నెలలో ప్రవీణ్ నెట్టార్ అనే బీజేపీ నేత హత్య జరిగింది. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.