NTV Telugu Site icon

Parliament ‘assault’ case: రాహుల్ గాంధీ పార్లమెంట్ ‘‘దాడి’’ కేసుపై స్పెషల్ టీం ఏర్పాటు..!

Pratap Sarangi

Pratap Sarangi

Parliament ‘assault’ case: పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాహుల్ గాంధీ తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టివేయడంతో వారు గాయపడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. సభలోకి వచ్చే ప్రయత్నంలో రాహుల్ గాంధీ తమను నెట్టారని బీజేపీ చెబుతోంది.

Read Also: Ujjain: ప్రాణం తీసిన ‘‘దుపట్టా’’.. మిషన్‌లో ఇరుక్కుని మహిళ మృతి..

ఈ ఘటనపై పోలీసులకు బీజేపీ ఎంపీలు గురువారం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీపై కేసు దర్యాప్తును చాణక్యపురిలోని ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఇంటర్‌స్టేట్ సెల్ (ISC) విభాగం నిర్వహిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఆందోళన చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు దీనిపై భౌతికదాడి, రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

అంతకుముందు శుక్రవారం, ఈ కేసును పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ నుంచి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. శుక్రవారం రాత్రి క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. ఈ టీంలో ఇద్దరు ఏఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు. ఈ టీం నేరుగా డీసీపీకి రిపోర్ట్ చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అందచేయాలని పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్‌ని పోలీసులు ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌, దర్యాప్తు పత్రాలు క్రైమ్ బ్రాంచ్‌కి అందాల్సి ఉంది.