భారతీయులకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఐఎండీ గుడ్‌న్యూస్ చెప్పింది.
ఈ ఏడాది నిర్ణీత తేదీ కంటే 5 రోజుల ముందుగానే రుతుపవనాలు భారత్‌కు రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు వేగంగా భారతదేశం వైపు దూసుకొస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువు కంటే ఐదు రోజుల ముందే అండమాన్‌ను తొలకరి ముద్దాడనుందని పేర్కొంది. ప్రస్తుతం తీవ్రమైన వేడి గాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది భారీ ఉపశమనం కలిగించే వార్తగా చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే మే నెలలోనే ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. భీకరమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణం కంటే ముందుగానే మే 15వ నాటికి అండమాన్-నికోబార్ దీవులను రుతుపవనాలు తాకనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడీనం, తుఫాను కారణంగా రుతుపవనాలు ఊపందుకున్నాయని చెప్పింది.
ఇప్పటికే ఏప్రిల్, మే నెలలో కురిసిన వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారాయి. హిమాలయాల్లో గాలుల కదలికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు రుతుపవనాలు వేగంగా భారత్ వైపు దూసుకొస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళకు చేరుకోనున్నాయి.
ఐఎండీ అప్‌డేట్ ప్రకారం… మే 16వ తేదీన బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రుతుపవనాలు మొత్తం ద్వీప సమూహానికి భారీ వర్షాలను తీసుకురావచ్చు. సాధారణంగా రుతుపవనాలు మే 20వ తేదీ నాటికి అండమాన్- నికోబార్ దీవులకు చేరుకుంటాయి. అయితే ఈసారి ఊహించిన సమయం కంటే ఐదు రోజుల ముందే అండమాన్ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకడం అన్నదాతలకు గుడ్‌న్యూస్‌గా చెప్పొచ్చు. గత సంవత్సరం 2025లో రుతుపవనాలు మే 13వ తేదీన అండమాన్-నికోబార్ దీవులకు చేరుకున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో పాటు ఒక తుఫాను కూడా చురుకుగా కదులుతోంది. ఈ తుఫాను రుతుపవనాల ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత 15 రోజుల్లోనే జూన్ 1వ తేదీన నాటికి కేరళకు చేరుకుంటాయి. అండమాన్ దీవుల్లోకి ముందుగానే ప్రవేశించడం వల్ల అవి కేరళకు కూడా అంతకంటే ముందే చేరుకునే అవకాశం ఉంది.
