ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాయకత్వ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సమావేశమైన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ… ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామాకు సిద్ధమన్న ఆమె ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా.. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించారు.. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యం అని స్పష్టం చేసిన ఆమె.. గాంధీ కుటుంబం వల్లే పార్టీ బలహీన పడిందని భావిస్తున్నారు.. కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం కోరితే.. తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు సోనియా గాంధీ.
Read Also: CWC Meeting: రాజీనామాకు సిద్ధపడిన సోనియా గాంధీ
అయితే, సోనియా గాంధీయే పార్టీ చీఫ్‌గా కొనసాగుతారని ఇవాళ జరిగిన కీలక సమావేశం తేల్చేసింది.. ఐదు రాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమిపై నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది సీడబ్ల్యూసీ.. ఐదు రాష్ట్రాల్లో గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు, సమగ్ర మార్పులు, నాయకత్వ మార్పుపై చర్చ సాగింది.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా మాకు నాయకత్వం వహిస్తారు.. భవిష్యత్ చర్యలు తీసుకుంటారు, ఆమె నాయకత్వంపై మా అందరికీ నమ్మకం ఉంది అని పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, చిదంబరం తదితరులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి హాజరైన వారిలో ఉన్నారు. కాగా, కాంగ్రెస్ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ చేతిలో ఓడిపోయింది, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్‌లను బీజేపీ నుండి కైవసం చేసుకోలేకపోయింది.. ఇక, రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీ సంఖ్య అత్యల్ప స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే.