NTV Telugu Site icon

అధినేత్రి నుంచి కాంగ్రెస్‌ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు..

Sonia Gandhi

Sonia Gandhi

కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్‌ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్‌ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు. అంతేకాదు.. ఈ ఏడాది చివరి నాటికి 75 శాతం మంది ప్రజలకు టీకాలు అందించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అప్పుడే కరోనా ముప్పును అధిగమించగలమన్నారు సోనియా గాంధీ.

మూడో వేవ్‌ ముంచుకొస్తుందన్న హెచ్చరికలపైనా ఆమె స్పందించారు. మూడోవేవ్‌కు దేశం సిద్ధంగా ఉండాలని చెప్పారు. సెకండ్‌ వేవ్‌ విలయం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. మూడో వేవ్‌ ముప్పు నుంచి చిన్నారులను మినహాయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై పోరాటం చేయాలని నాయకులకు సోనియా గాంధీ సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై రైతులు, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోందని చెప్పారు. దీనిపై నిరంతరం ఆందోళనలు చేపట్టాలని అన్నారు. దీంతో పాటు నిత్యవసర ధరలు కూడా పెరుగుతున్నట్లు తెలిపారు సోనియా గాంధీ. ఇక కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేయాలని నాయకులకు చెప్పారు.