NTV Telugu Site icon

Mamata Banerjee: ‘‘కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉంటాయి.’’ దీదీ సంచలన వ్యాఖ్యలు..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి గెలిచి, ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడులకు ఢిల్లీ ముస్తాబైంది. అయితే, ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉంటాయని అన్నారు. శనివారం తృణమూల్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి తమ పార్టీ హాజరుకాబోదని చెప్పారు.

‘‘400 సీట్ల గురించి మాట్లాడిన బీజేపీ, మెజారిటీ కూడా పొందలేకపోయిందని అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటే ఏమీ జరగదని అనుకోకండీ, ఎందుకంటే పరిస్తితులు మారుతూనే ఉంటాయి, మేం చూస్తుంటాం, కొన్ని రోజుల తర్వాత కొత్త ఇండియా ప్రభుత్వం ఏర్పడుతుంది, కొన్ని రోజులు వారు అధికారంలో ఉండనివ్వండి. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక రోజు మాత్రమే ఉన్నాయి. ఏదైనా జరగొచ్చు, ఎవరికి తెలుసు ఈ ప్రభుత్వం 15 రోజులే ఉంటుందేమో..?’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Read Also: Fadnavis: వ్యూహం మార్చిన ఫడ్నవీస్.. మహా ఎన్నికలే టార్గెట్!

బీజేపీ పౌరసత్వ సవరణ చట్టం (CAA)తో సహా కఠినమైన చట్టాలను రద్దు చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా ఏర్పడుతున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పలేమని, మళ్లీ వారు పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తారని, ప్రమాణస్వీకారానికి తమకు ఆహ్వానం అందలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 ఎంపీ సీట్లలో బీజేపీ 12 సీట్లు గెలుచుకోగా.. టీఎంసీ 29 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో బీజేపీకి 18 రాగా, టీఎంసీకి 22 వచ్చాయి.

మొత్తంగా ఈ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలను కైవసం చేసుకుంది. 2014, 2019లో రెండుసార్లు బీజేపీ స్వతహాగా మ్యాజిక్ ఫిగర్( 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272) స్థానాలను గెలుచుకుంది. ఈ సారి మెజారిటీకి దాదాపుగా 30 సీట్లు తక్కువగా వచ్చాయి. మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన మద్దతుతో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.