Indian Army: జమ్మూ కాశ్మీర్‌లోకి విదేశీ ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రాజౌరీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు ఆర్మీ అధికారులకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరేతోయిబా టాప్ కమాండర్ కారీతో పాటు మరో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.
కీలక ఉగ్రవాది కారీని హతం చేయడం ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బగా ద్వివేది పేర్కొన్నారు. మేము మిలిటెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారిలో కొందరు రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది ఉన్నారని తమకు తెలిసిందన్నారు. ఇలా సరిహద్దు దాటుతున్న ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ సైనికలు ఉన్నారని తెలిపారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో 20-25 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సహకారంతో గత ఏడాదిగా ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని అన్నారు.
Read Also: Vadhuvu: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను భయపెట్టేలా “వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్
తమ ఆర్మీ సిబ్బంది ప్రాణాలను లెక్క చేయకుండా భయంకరమైన ఉగ్రవాదుల్ని హతమార్చాని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇతర దేశాల్లో ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందటం వల్ల ఆపరేషన్‌కి సమయం పడుతోందని, మన ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రాజౌరీ జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఎన్‌కౌంటర్ 24 గంటల పాటు సాగింది. ఇందులో ఇద్దరు కెప్టెన్లతో సహా మొత్తం ఐదుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఇద్దరు కీలక ఉగ్రవాదుల్ని హతమార్చారు.
ఉగ్రవాదులు పీఓకే, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న అటవులను , పీర్ పంజాల్ కొండలను ఆసరాగా చేసుకుని భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జమ్మూలోని రాజౌరీ, పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఉగ్రవాద చర్యలు పెరిగాయి. పీర్ పంజాల్ పర్వత శ్రేణిలోని కొండలు, అడవులు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపించాలని ప్రయత్నిస్తోంది. మన సైన్యం ఎప్పటికప్పుడు వీరిని నిర్మూలిస్తోంది.