Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు భారతదేశ వ్యతిరేక ముఠాలో చేరారని అన్నారు. వారు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2023లో మాట్లాడుతూ కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య క్లియర్ గా రాజ్యాంగంలో విభజన ఉందని గుర్తు చేశారు. ఇటీవల న్యాయమూర్తుల జవాబుదారీతనంపై ఒక సెమినార్ జరిగింది. దీని గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Congress : నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలి.. టీఎస్పీఎస్సీలో అసలు దొంగలెక్కడ?: పొన్నం
న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలాగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. న్యాయమూర్తులకు ఏ రాజకీయాల్లో భాగం కాదని తెలిపారు. కాంగ్రెస్ వల్ల కొలీజియం వ్యవస్థ వచ్చిందని, రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి సుప్రీంకోర్టు, హైకోర్టుకు న్యాయమూర్తులను నియమిస్తారని గుర్తు చేశారు. అయితే కొత్త వ్యవస్థను తీసుకువచ్చే వరకు కొలీజియం వ్యవస్థను కొనసాగిస్తామని అన్నారు.
ఇటీవల ఎన్నికల కమిషనర్లను నియామకంలో ప్రధాని, ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై కిరణ్ రిజిజు స్పందించారు. రాజ్యాంగంలో కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయవ్యవస్థకు మధ్య లక్షణ రేఖ ఉందని వ్యాఖ్యానించారు. కార్యనిర్వహణ వ్యవస్థలోకి న్యాయవ్యవస్థ వస్తే న్యాయపరమైన పనిని ఎవరు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది అమలులోకి వస్తే అనేక విమర్శలు వస్తాయని అన్నారు. ఒక నియామకంలో న్యాయవ్యవస్థ పాలుపంచుకుంటే, ఏదైనా సమస్య వస్తే కోర్టులు ఆశ్రయిస్తే ఆ నియామకంపై తీర్పు ఎలా ఇవ్వగలరని అన్నారు.