Modi 3.0 Cabinet: లోక్‌సభ ఎన్ని్కల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించింది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ఈ రోజు ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా తన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశ ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, సీషెల్స్, మారిషన్ దేశాధినేతలు హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే మోడీ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎంపీలకు కాల్స్ వెళ్లాయి. వీరంతా ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, జేడీయూ, శివసేన పార్టీలకు కూడా కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన పలువురు బీజేపీ నాయకులకు ఈ సారి మొండిచేయి చూపించారు.
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణేలకు ఈ సారి మంత్రి పదవులు దక్కవని సమాచారం. స్మృతీ ఇరానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో త్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాంగ్రెస్ విధేయుడు కిషోరీ లాల్ శర్మ చేతిలో 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఈ సారి మాత్రం విజయం సాధించలేకపోయారు. గతంలో మోడీ మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
హిమాచల్ ప్రదేశ్ హమీర్ పూర్ నుంచి ఎంపీగా గెలిచిన అనురాగ్ ఠాకూర్‌కి కూడా ఈ సారి మంత్రి పదవి దక్కదని తెలుస్తోంది. ప్రధాని మోడీ రెండో టర్మ్‌లోని మంత్రివర్గంలో ఈయన క్రీడలు మరియు సమాచార మరియు ప్రసార శాఖలను నిర్వహించారు. ఇక మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రత్నగిరి-సింధు దుర్గ్ నుంచి విజయం సాధించిన నారాయణ రాణేకి కూడా ఈ సారి బెర్త్ కన్ఫామ్ కాలేదని సమచారం. గతంలో ఈయన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.
ప్రస్తుతం మోడీ 3.0 కేబినెట్‌లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవియా, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు , CR పాటిల్, L మురుగన్, హర్దీప్ పూరి, ML ఖట్టర్, శివరాజ్ చౌహాన్, గజేంద్ర షెకావత్, సురేష్ గోపి, మరియు జితిన్ ప్రసాదలకు మంత్రి పదవులు దక్కతున్నట్లు సమచారం. ఎన్డీయేలోని ఇతర నేతలైన హెచ్‌డి కుమారస్వామి, జయంత్ చౌదరి, ప్రతాప్ జాదవ్, రామ్ మోహన్ నాయుడు, సుదేశ్ మహతో మరియు లల్లన్ సింగ్‌లకు మంత్రి పదవులు దక్కుతున్నాయి.