Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్‌మెయిల్ కోణంలో దర్యాప్తు..

  • కేతన్ అగర్వాల్ హత్య కేసులో బ్లాక్‌మెయిల్ కోణంపై దర్యాప్తు.
  • ప్రియుడు చేతన్ బెదిరింపులతోనే సియా హత్య చేసిందా అనే అనుమానం.
  • డబ్బు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Ketan Murder Case

Ketan Murder Case

Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, లోయలోకి తోసి చంపారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. నిందితురాలు సియా, తన ప్రియుడు చేతన్ ఒత్తిడి, బ్లాక్‌మెయిల్ కారణంగా ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా-చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, పర్సనల్ మెసేజ్‌లు బయటపెడుతానని బెదిరించి, హత్యకు కుట్ర పన్నాడా అనే దిశగా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు అంతకుముందు జరిగిన హత్యాయత్నం కేసులో సియా పాత్రను బయటపెడుతానని బెదిరించి, కుట్ర కొనసాగించాడా అనే కోణంలో కూడా డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు.

ఇదే కాకుండా, మొదట సియాతో పారిపోదామనుకున్న చేతన్, ఆ తర్వాత గోయల్, అగర్వాల్ కుటుంబాల ఆర్థిక సంపద, సామాజిక పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని కేతన్‌ను పూర్తిగా అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నాడా అనే అంశంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సియా బ్యాంక్ అకౌంట్స్ నుంచి చేతన్‌కు బారీ మొత్తంలో డబ్బు బదిలీ చేశారా అని పరిశోధిస్తున్నారు. నిఘా కోసం చేతన్‌కు సియా భారీ మొత్తంలో డబ్బులు పంపిందా.? తొలి హత్యాయత్నం తెలిసిన చేతన్ డబ్బు కోసం సియాను బ్లాక్‌మెయిల్ చేశాడా?, పెళ్లి అడ్డంకి తొలిగిన తర్వాత కుటుంబ ఆస్తుల నుంచి నెలవారీగా డబ్బు లేదా ఒకే మొత్తంలో ఇస్తానని సియా ఒప్పుకుందా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

జూన్ 18న జరిగిన హత్యకు ముందు సియా నగదు విత్ డ్రా చేసిందా అనే విషయాన్ని ఫోరెన్సిక్ టీమ్స్ విశ్లేషిస్తున్నాయి. దీనికి ముందు జూన్ 14న లోహ్‌గఢ్ కోటలో చేతన్‌ను సియా తోసి చంపే ప్లాన్ విఫలమైంది. ఇదిలా ఉంటే, హత్యకు ఒక రోజు ముందు పూణేలోని కేఫేలో ఇద్దరు గంట పాటు చర్చించుకోవడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అక్కడే మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.