NTV Telugu Site icon

Nirmala Sitharaman: గత మూడేళ్లలో రూ.6 లక్షల కోట్ల రుణాలు రద్దు

Loans

Loans

Nirmala Sitharaman: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన మూడేళ్లలో దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసి మొండి బకాయిలు(NPA)గా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్‌బీఐనే రూ.1,64,735 కోట్ల రుణాలు రద్దు చేసిందని చెప్పారు. ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.61,763 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.59,807 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.52,655 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.37,617 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.34,281 కోట్లు, ఐడీబీఐ రూ.32,586 కోట్లు, యూకో బ్యాంక్ రూ.30,160 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.22,522 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.21,772 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.18,874 కోట్ల రుణాలను రద్దు చేశాయి.

ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రుణాలన్నీ రద్దు చేసి వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత ఎన్‌పీఏలను రద్దు చేసి బ్యాలెన్స్ షీట్ల నుంచి తొలగిస్తారని ఆమె వివరించారు. అయితే సివిల్ కోర్టులు, రుణ రికవరీ ట్రిబ్యునళ్ల ద్వారా, చట్టపరమైన చర్యల ద్వారా నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన రునాలను వసూలు చేసుకునే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Read Also: Jairam Ramesh: మోడీ తన ప్రతిష్ట కోసం.. దేశాన్నే ప్రమాదంలో పడేశారు

కాగా పేద ప్రజల రుణాలను రద్దు చేయకుండా బడా కంపెనీల రుణాలనే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. రుణాల మాఫీ పేరుతో పేద ప్రజల డబ్బులను ప్రభుత్వ బ్యాంకులు లూటీ చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు. కాగా రైట్ ఆఫ్ చేసే రుణాల వివరాలను ప్రతి త్రైమాసికంలోనూ బ్యాంకులు ప్రజలకు వెల్లడిస్తుంటాయి. ముఖ్యంగా స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లలో నమోదైన బ్యాంకులు ప్రతి త్రైమాసికంలో తమ ఫలితాలను వెల్లడించేటప్పుడు ఈ వివరాలకు కూడా బయటపెడతాయి. ఈ ఫలితాల్లో ఎంత మొత్తం రుణాలను మాఫీ చేశారో తమ షేర్‌హోల్డర్స్‌కు తప్పనిసరిగా బ్యాంకులు వెల్లడించాల్సి ఉంటుంది.

Show comments