Singer KS Chithra: దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. లక్షలాది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నాయి. అయోధ్యలో పూర్తిగా పండగ వాతావరణం ఏర్పడింది. యోగి సర్కార్ అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ సమయంలో ప్రజలు రాముడి శ్లోకాలు జపించాలని ఇటీవళ వీడియో సందేశాన్ని పంపారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో.. ప్రతీ ఒక్కరు పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు మధ్యాహ్నం 12.20 గంటలకు ‘శ్రీరామ జయ రామ జయజయ రామ’ మంత్రాన్ని జపించాలని చిత్రకోరారు. అదే రోజు సాయంత్రం ప్రజలు తమ ఇళ్లలో ఐదు వత్తుల దీపాలను వెలిగించాలని కోరారు. ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉందడాలని కోరుకుంటూ ‘లోకా సమస్త సుఖినో భవంతు’ అంటూ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
అయితే చిత్ర ఇలా పిలుపునివ్వడాన్ని నెటిజన్లలో ఓ వర్గానికి నచ్చలేదు. ఆమె చర్యల్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా ఆమె రాజకీయంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు మరో వర్గం ఆమె తన భావాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఉందని చెబుతూ ఆమెకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతకుముందు ఇలాగే త్రిసూర్‌లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో నటి శోభన ప్రధాని నరేంద్రమోడీతో వేదిక పంచుకోవడాన్ని కూడా ఒక వర్గం ప్రజలు తీవ్రంగా విమర్శించారు.