Sidhu Moose Wala assassination Mastermind Goldy Brar Detained In California: పంజాబీ సింగర్, పొలిటికల్ లీడర్ సిద్దూ మూసేవాలా హత్యలో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అయిన గోల్డీ బ్రార్ మూసేవాలా హత్యలో మాస్టర్ మైండ్. ఇటీవల కెనడా నుంచి యూఎస్ఏకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాల్నిఫోర్నియాలో నవంబర్ 20న గోల్డీ బ్రార్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమచారం. ఈ మేరకు అమెరికా అధికారిక వర్గాలు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించాయి.
Read Also: Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య
మూసేవాలా హత్య తర్వాత బ్రార్, కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు శాక్రమెంటో, ఫ్రిజో, సాల్ట్ లేక్ సిటీల్లో నివాసం ఉంటూ వస్తున్నాడని సమాచారం. గోల్డీ బ్రార్ దొరికినట్లు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), సీబీఐ, పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ అరెస్ట్ పై కాలిఫోర్నియా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించన తర్వాత గోల్డీ బ్రార్ సమాచారం ఇస్తే రూ. 2 కోట్ల రివార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన తండ్రి డిమాండ్ చేశాడు. ఒక వేళ కేంద్రం ఈ డబ్బు ఇవ్వలేకపోతే నేనే సొంతంగా డబ్బులు ఇస్తానని సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఇటీవల పంజాబ్ అమృత్ సర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన గోల్డీ బ్రార్ 2017లో స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లాడు. గత నెలలో జరిగిన డేరా సచ్చా సౌదా అనుచరుడి హత్యలో కీలక సూత్రధారిగా కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. మే 29న పంజాబ్ మాన్సాలోని తన ఇంటి నుంచి జీపులో బయటకు వచ్చిన సిద్దూ మూసేవాలాను, కాపు కాచి దుండగులు హత్య చేశారు. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సెలబ్రెటీలకు సెక్యురిటీ తగ్గించిన కొన్ని రోజుల్లోనే ఈ హత్య జరిగింది.
