Site icon NTV Telugu

Karnataka Congress: పెద్ద ప్లానే.. డీకే శివకుమార్‌‌కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వ్యూహం..

Dk Shivakumar , Siddaramaia

Dk Shivakumar , Siddaramaia

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్‌ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి. రెండు పవర్ సెంటర్స్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక వేళ సీఎం పదవి డీకే శివకుమార్‌కు కట్టబెడితే, తాము ఏం చేయాలనే దానిపై సిద్ధరామయ్య వర్గం వరస సమావేశాలు నిర్వహిస్తోంది. డీకేను సీఎంగా నిర్ణయించాలనుకుంటే, వెంటనే తామంతా ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని సిద్ధరామయ్య వర్గం భావిస్తోంది.

Read Also: Hyderabadi Biryani: హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ స్థాయి గుర్తింపు

ఒక వేళ కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపితే, ఆయనకు కాకుండా వేరే వ్యక్తికి సీఎం పదవి అప్పగించాలని సిద్ధరామయ్య వర్గం కోరే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన సిద్ధరామయ్య వర్గానికి చెందిన బలమైన దళిత నేత. ఈ వ్యూహాన్ని సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రి సతీష్ జార్కిహోలీ రచించారు. ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటకలో దిగజారకుండా అధిష్టానం నెమ్మదిగా పావులు కదుపుతోంది. ఈ సంక్షోభంపై ఖర్గే, సోనియా, రాహుల్ కలిసి సమావేశం కానున్నారు. ఆ తర్వాత సిద్ధరామయ్య, డీకేలను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది.

మరోవైపు, డీకే శివకుమార్ వర్గం మాత్రం అధిష్టానం మాట నిలబెట్టుకోవాలని చెబుతోంది. 2023 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి అంటూ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య సయోధ్య కుదిర్చింది. ఇప్పుడు ఈ సమయం రావడంతో డీకే సీఎం పదవి కోరుతున్నారు. ఆ సమయంలో డీకేను సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ హైకమాండ్ ‘‘ఒక వ్యక్తికి ఒకే పదవి’’ అనే సూత్రాన్ని పక్కన పెట్టి డీకేకు కర్ణాటక పీసీసీ చీఫ్ పదవితో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.

Exit mobile version