President Murmu: కర్ణాటక మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం సిద్ధరామయ్యకు మధ్య ఆహ్లాదకరమైన సంభాషణకు వేదికగా మారింది. ‘‘మీకు కన్నడ తెలుసా.?’’ అని సీఎం, రాష్ట్రపతిని ప్రశ్నించారు. ఇందుకు ఆమె ‘‘తనకు భాష తెలియదని, అయితే నేర్చుకుంటానని మాత్రం హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.
Read Also: Snake Bite: చెప్పులో దాక్కున్న పాము.. కాటేయడంతో టీసీఎస్ ఉద్యోగి మృతి..
సోమవారం ఉదయం ముర్ముని మైసూరు విమానాశ్రయంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్యలు స్వాగతించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు , మైసూరు రాజ వంశస్థుడు బీజేపీ ఎంపీ యదువీర్ వడియార్ సహా సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో స్వాగత ప్రసంగాన్ని సిద్ధరామయ్య కన్నడలో ప్రారంభించారు. ఆ సమయంలో రాష్ట్రపతి వైపు చూస్తూ, నవ్వుతూ ‘‘మీకు కన్నడ తెలుసా..?’’ అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘‘గౌరవనీయ ముఖ్యమంత్రికి నేను చెప్పాలనుకుంటున్నాను, కన్నడ నా మాతృభాష కాకపోయినా, నా దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు,సంప్రదాయాలను నేను ఎంతో గౌరవిస్తాను. వాటిలో ప్రతిదాని పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ తమ భాషను సజీవంగా ఉంచుకోవాలని, వారి సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని , ఆ దిశలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా కన్నడను క్రమంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆమె అన్నారు.