Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మసీదులోపలన జైశ్రీరాం అని అరవడం ఏ తరగతి మనోభావాలను , మత భావాలను ఉల్లంఘించలేదు అని పేర్కొంది. మసీదులో నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై మత విశ్వాసాలను అవమానపరిచారని నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని కోర్టు రద్దు చేసింది.
దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన కీర్తన్ కుమార్, సచిన్ కుమార్‌లపై క్రిమినల్ కేసుల్ని రద్దు చేస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్న గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్లు 295 A, 447, 506లతో సహా పలు సెక్షన్ల కింద స్థానిక పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. ఇద్దరు గతేడాది సెప్టెంబర్‌లో రాత్రి స్థానిక మసీదులోకి ప్రవేశించి జైశ్రీరాం అని అరిచారు.
Read Also: Hoax bomb threats: ఢిల్లీ-చికాగో ఎయిరిండియాతో సహా 5 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు..
‘‘సెక్షన్ 295ఏ ఉద్దేశపూర్వకంగా, హనికరమైన చర్యలను ద్వారా మతాల భావాల దెబ్బతీయడం గురించి చెబుతుంది. ఎవరైనా జై శ్రీరాం అని కేకలు వేస్తే అది ఏ వర్గానికి చెందిన వారి మత భావాలను ఎలా రెచ్చగొడుతుందో అర్థం కావడం లేదు. ఈ ప్రాంతంలో హిందూ-ముస్లింలు సామరస్యపూర్వకంగా జీవిస్తున్నారని ఫిర్యాదుదారు స్వయంగా పేర్కొన్నప్పుడు, ఈ సంఘటన ఎంతమాత్రం విరోధానికి దారితీయదు’’ అని హైకోర్టు పేర్కొంది.
పిటిషనర్ తరుపు న్యాయవాది వాదిస్తూ.. మసీద్ పబ్లిక్ ప్లేస్ అని, అందువల్ల క్రిమినల్ అతిక్రమణ కేసు ఉండదని వాదించారు. అంతేకాకుండా, జైశ్రీరాం అని అరవడం ఐపీసీ సెక్షన్ 295ఏ కింద నిర్వచించిన నేరం కిందకు రాదని కోర్టుకు చెప్పారు. అయితే, రాష్ట్రప్రభుత్వం ఈ పిటిషన్‌ని వ్యతిరేకిస్తూ ఈ విషయంపై తదుపరి విచారణ అవసరమని చెప్పింది.ఈ కేసు పబ్లిక్ ఆర్డర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని కోర్టు పేర్కొంది.
‘‘IPC సెక్షన్ 295A ప్రకారం ఏదైనా ప్రతీ చర్య నేరంగా మారదని సుప్రీంకోర్టు పేర్కొంది. పబ్లిక్ ఆర్డర్‌పై ఎలాంటి విధ్వంసం చూపని చర్యలు ఐసీసీ సెక్షన్ 295A ప్రకారం నేరానికి దారితీయవు. ఇలాంటి నేరాల్లో ఏ విధమైన ప్రతికూల ఫలితాలు లేనప్పుడు, ఈ పిటిషన్‌లపై తదుపరి చర్యలను అనుమతించడం అనేది చట్టం ప్రక్రియని దుర్వినియోగం చేయడం, న్యాయ దుర్వినియోగానికి దారి తీస్తుంది’’ అని కోర్టు పేర్కొంది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సచిన్ బిఎస్ వాదనలు వినిపించారు. రాష్ట్రప్రభుత్వం తరుపున హెచ్‌సీజీపీ సౌమ్య ఆర్ హాజరయ్యారు.