Site icon NTV Telugu

Shiv Sena: మహారాష్ట్రలో చీలిక అంచున శివసేన..!!

Shivsena

Shivsena

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి -మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ చిక్కుల్లో పడింది. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే 22 మంది ఎమ్మెల్యేలతో అజ్ఞానతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో గల ఒక హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేతో పాటు కొందరు ఎమ్మెల్యేలు తమకు అందుబాటులోకి రావడం లేదని శివసేన నేతలు కూడా అంగీకరిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.

దివంగత బాల్ ఠాక్రేకు అత్యంత విధేయుడైన ఏక్‌నాథ్ షిండే మహావికాస్ అఘడి సర్కార్‌ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే ప్రస్తుత సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. అయితే పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని శివసేన ఎమ్మెల్యేలు ఆశాభావంతో ఉన్నారు. అయితే సూరత్‌లో షిండేతో పాటు మరో 35 మంది శాసనసభ్యులు ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత నిజం ఉన్నదో తెలియదు. కానీ అదే నిజమైతే ఆ శాసన సభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రారు. అసెంబ్లీలో బలపరీక్షకు నిలవాలని వారు ముఖ్యమంత్రిని అడగవచ్చు. ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి సూచనలు లేవు. ఇదిలా ఉంటే సూరత్‌కు తమను ఎందుకు పిలిపించారో.. తాము ఏం చేస్తున్నామో తెలియని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర గందరగోళంలో ఉన్నట్టు సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని మహరాష్ట్ర బీజేపీ అంటోంది. కానీ తిరుగుబాటు నేత షిండే నుంచి బీజేపీలో చేరే ప్రతిపాదన ఏదైనా వస్తే అందుకు అంగీకరిస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ స్ఫష్టం చేశారు. కానీ మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ పతనమవుతుందా అంటే మాత్రం సమాధానం దాటవేస్తున్నారు.

మరోవైపు షిండే అజ్ఞాతంలో ఉన్నాడని వచ్చిన వార్తలను సంజయ్ రౌత్ కొట్టిపారేస్తున్నాడు. ఆయన తమకు అందుబాటులోకి వచ్చాడని చెప్పారు. షిండే కరుడుగట్టిన శివ సైనికుడు మాత్రమే కాదు పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రేకు గొప్ప విధేయుడని రౌత్‌ గుర్తుచేశారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు తమ ఎమ్మెల్యేలను రప్పించటాన్ని బట్టి దీని వెనుక ఎవరు ఉన్నారో సులభంగా అర్థమవుతోందని రౌత్‌ అన్నారు.

ఏదేమైనా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని బీజేపీ అధినేత జేపీ నడ్డా ఇంటికి వెళ్లారు. మహారాష్ట్ర మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశారు. గత శాసన సభ ఎన్నికల ముందు తమతో అధికారం పంచుకుంటామని అమిత్‌ షా హామీ ఇచ్చి మాటతప్పారని సీఎం ద్ధవ్ థాకరే ఆరోపించారు. అయితే అలాంటి ఒప్పందం ఏదీ తమ మధ్య కుదరలేదని అమిత్‌ షా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తాజా సంక్షోభంలో షా పాత్ర కీలకం కానుంది.

ఇదిలా ఉంటే ఈ సంక్షోభానికి కేంద్ర బిందువైన మంత్రి ఏక్‌ నాథ్‌ షిండే సీఎం ఉద్దవ్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన కలవటం ఆయనకు మొదటి నుంచీ ఇష్టం లేదు. దీనికి తోడు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో తనకు ఏమాత్రం స్వేచ్ఛలేదని భావిస్తున్నారు. తన మంత్రిత్వ శాఖలపై కూడా పెత్తనమంతా సీఎం, ఆయన కుమారునిదేనని షిండే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం షిండే, ఆయన అనుచరులే కాదు పార్టీ ఎమ్మెల్యేలంతా ఇదే భావనలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల నిధుల కేటాయించటంలో ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సవతి తల్లిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక, ప్రణాళికా మంత్రిత్వ శాఖలు పవార్ వద్దే ఉన్నాయి. ఇందులో సీఎం జోక్యం చేసుకుంటారని షిండే వర్గం ఆశించింది. కానీ అలాంటిదేమీ జరగకపోవటంతో ఆయలో అసంతృప్తి మరింత తీవ్రమైంది. కానీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మిత్రపక్షాలను టచ్‌ చేసే సాహసం చేయలేరు. వారి ఆగ్రహానికి గురికావడం ఇష్టంలేక మౌనాన్ని ఆశ్రయించారని అసంతృప్త ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే సీఎం మౌనం వహించటం తమకు ఇబ్బందిగా మారిందని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ ఇలాంటి అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఇప్పుడిక ‘ఆపరేషన్ కమలం’కు దిగుతుందనటంలో సందేహం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేయటంలో సిద్ధహస్తులనే ఆరోపణలు బీజేపీ మీద ఇప్పటికే ఉన్నాయి. అదీగాక, రాష్ట్రంలో ప్రజా అనుకూల ప్రభుత్వం ఏర్పడే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని దేవేంద్ర ఫడ్నవిస్ అంటున్నారు. మహా వికాస్‌ ఆఘడిలో…ముఖ్యంగా శివసేనలో పెరుగుతున్న అసంతృప్తిని ఉపయోగించుకోవడానికి బీజేపీ రంగం సిద్ధం చేసిందని ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ ఐదవ నామినీ ప్రసాద్ లాడ్, అలాగే రాజ్యసభ ఎన్నికలలో దాని మూడవ నామినీ ధనంజయ్ మహదిక్ విజయం అధికార కూటమిలో చీలిక వల్లే సాధ్యపడింది.

అటు తాజా సంక్షోభం శివసేన మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం శివసేనను చీల్చాలంటే 36 మంది శాసనసభ్యులు ఫిరాయించాలి. ప్రస్తుతం వారి వద్ద అంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. షిండే నేతృత్వంలో ఈ చీలిక వర్గం త్వరలో గవర్నర్‌కు లేఖ ఇవ్వనుంది. ఆ తర్వాత శాసన సభలో మెజారిటీ నిరూపించుకోవాలని సీఎంను వారు కోరడంతో బంతి గవర్నర్ కోర్టులోకి వెళుతుంది. మెజారిటీ నిరూపించుకోవడంపై సీఎంకు అనుమానం ఉంటే సభలో ఓటమిని తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేయవచ్చు. తరువాత, శాసనసభ్యుల మద్దతుతో లేఖను సమర్పించడానికి గవర్నర్ బీజేపీని పిలవవటంతో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతకం సభలో బలం నిరూపించుకోవాలని నూతన ముఖ్యమంత్రిని గవర్నర్ కోరతారు. అదే నిజమైతే శిససేనలో ఇది నాలుగో అతిపెద్ద చీలిక అవుతుంది. 1990లో ఛగన్ భుజ్‌బల్ సేన నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. తర్వాత నారాయణ్ రాణే 2005లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత రాజ్ థాకరే 2005లో పార్టీ నుంచి బయటకు వెళ్లి ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీని స్థాపించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూరత్‌లో ఉన్న సేన తరుగుబాటు శిబిరం ఎమ్మెల్యేలలో ఏకనాథ్ షిండే- కౌపరి, అబ్దుల్ సత్తార్ – సిల్లోడ్ – ఔరంగాబాద్. శంభురాజ్ దేశాయ్ – సతారా, సందీపన్ బుమ్రే – పైథాన్ , ఉదయస్‌తో రాజ్‌పుత్ – కన్నడ, భరత్ గోగవాలే – మహద్, నితిన్ దేశ్‌ముఖ్ – బాలాపూర్, అనిల్ బాబర్ – ఖానాపూర్, విశ్వనాథ్ భోయిర్ – కళ్యాణ్ వెస్ట్, సంజయ్ గైక్వాడ్ – బుల్దానా, సంజయ్ రాముల్కర్ – మెహకర్, మహేష్ సిండే – కోరేగావ్, షాహాజీ పాటిల్ – సంగోలా, ప్రకాష్ అబిత్కర్ – రాధాపురి, సంజయ్ రాథోడ్ – డిగ్రాస్, జ్ఞానరాజ్ చౌగులే – ఉమర్గాస్, తానాజీ సావంత్ – పరోడా, సంజయ్ శిర్సత్ – ఔరంగాబాద్ వెస్ట్, రమేష్ బోర్నారే – బైజాపూర్ తదితరులు ఉన్నారు. మిగతా వారు ఎవరనే దానిపై తగిన సమాచారం అందుబాటులో లేదు.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. అయతే, ప్రస్తుతం ఒక శాసనసభ్యుడు చనిపోవడంతో ఆ సంఖ్య 287కి తగ్గింది. 144 సీట్లు వస్తే మెజారిటీ సాధించినట్లు. ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 152 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 134 సీట్లు ఉన్నాయి. శివ సేనకు 56 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 22 మంది సూరత్ హోటల్‌లో ఉన్నారని అంటున్నారు. మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, శివసేన సంఖ్య 34కి తగ్గుతుంది. దీంతో సభలో మహా వికాస్ అఘాడి బలం 130కి తగ్గుతుంది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సభలో కొత్త మెజారిటీ మార్క్ 133 అవుతుంది. తమకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మెజారిటీ మార్కు కంటే ఇద్దరు ఎక్కువగా ఉన్నారని బీజేపీ ఇప్పుడు చెబుతోంది. అయితే ఈ 22 మంది సేన ఎమ్మెల్యేలు మారడానికి ప్రయత్నిస్తే వారు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి ఎన్నికవ్వాల్సి ఉంటుంది.

 

Agnipath: ‘అగ్నిపథ్‌’లో ఏముంది..? ఎందుకీ ఆగ్రహం..?

Exit mobile version