NTV Telugu Site icon

Shirdi bandh: మే 1 నుంచి షిర్డీ బంద్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై గ్రామస్తులు సీరియస్‌

Shirdi

Shirdi

Shirdi indefinite bandh: షిర్డీలోని సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించాలన్న ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతకు వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌కు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు. సాయిబాబా ఆలయానికి మరింత భద్రత కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్ట్ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.

Read also: Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..

ప్రస్తుతం బాబా ఆలయ భద్రతను సాయి సంస్థాన్ సిబ్బంది, ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు. ప్రతిరోజూ బాంబు స్క్వాడ్‌తో ఆలయాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే బాబా ఆలయ భద్రతపై సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఔరంగాబాద్ కోర్టు.. షిర్డీ సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సాయి సంస్థాన్ సీఐఎస్‌ఎఫ్‌తో భద్రతకు మద్దతు పలికింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ షిర్డీ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు సమావేశమై మహారాష్ట్ర దినోత్సవమైన మే 1వ తేదీ నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. అదే రోజు గ్రామసభ నిర్వహించి తదుపరి కార్యాచరణ తెలియజేస్తామని తెలిపారు. సాయిబాబా మందిరానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించకూడదని, రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని రద్దు చేయాలని కోరారు.

డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ వేసి షిర్డీ సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల మండలిని వీలైనంత త్వరగా నియమించాలని ప్రభుత్వం కోరుతోంది. షిర్డీ గ్రామస్థుల నుంచి 50 శాతం మంది ధర్మకర్తలను నియమించాలన్నారు. మరోవైపు గ్రామస్తులు సమ్మె చేసినా సాయిబాబా ఆలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచుతామని సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది. సాయిబాబా సంస్థాన్, సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్లలో భక్తుల వసతి కొనసాగుతుంది. భక్తులకు సాయిబాబా సంస్థానంలో అన్ని సౌకర్యాలు యథావిధిగా ఉంటాయన్నారు. అన్ని ఇతర వ్యాపారాలు పూర్తిగా మూసివేయబడతాయని తెలిపారు.
Tspsc paper leak: ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా