Site icon NTV Telugu

India Pakistan: దాయాదికి దెబ్బ మీద దెబ్బ.. పాక్ నౌకలకు భారత జలాల్లోకి ప్రవేశం నిషేధం..

India Pak

India Pak

India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌కి భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌ని ఎలా దెబ్బతీస్తే ఆ దేశం పతనమవుతుందో అలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే, పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, సినీయాక్టర్ల ఇన్‌స్టా అకౌంట్లు, యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. పాక్ మీడియా, వెబ్‌సైట్లను నిషేధించింది. ఇదే కాకుండా, పాక్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని నిషేధించింది.

Read Also: janulyri : జానులిరి, నేను పెళ్లి చేసుకుంటున్నాం.. దిలీప్ దేవ్ గన్ క్లారిటీ..

ఇదిలా ఉంటే, శనివారం పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై నిషేధాన్ని విధించిన భారత్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జెండా కలిగిన ఓడలు భారత జలాల్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని, తదుపరి నోటీసులు వచ్చే వరకు కొనసాగుతాయని, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్ జెండా ఉన్న ఓడలు తమ జలాల్లోకి రాకుండా, ఏ నౌక కూడా భారత ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిషేధించారు.

జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ.. ‘‘”ప్రజా ప్రయోజనం మరియు భారతీయ షిప్పింగ్ ప్రయోజనాల దృష్ట్యా, భారతీయ ఆస్తులు, సరుకు, సంబంధిత మౌలిక సదుపాయాల భద్రతను నిర్ధారించడానికి’’ ఈ ఆదేశాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా భారతీయ వర్తక నౌకల అభివృద్ధిని ప్రోత్సహించడం, సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడం ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Exit mobile version