త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. చాలా రోజులుగా పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను దగ్గరకు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో శశిథరూర్ భేటీ అయ్యారు. పార్టీతో తలెత్తిన సమస్యలపై చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల తిరువనంతపురంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ సీనియర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శశిథరూర్ హాజరు కాలేదు. దీంతో విభేదాలు కొట్టొ్చ్చినట్లు కనిపించింది. ఇక తన ఫిర్యాదులు పరిష్కరించాలని శశిథరూర్ లేఖ రాశారు. ఈ క్రమంలో సీనియర్లు కూడా సమస్యలు పరిష్కరించాలని హైకమాండ్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలను శశిథరూర్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశం జరిగినట్లుగా సమాచారం.
చాలా రోజులుగా కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరంగా ఉంటున్నారు. బీజేపీ నేతలతో ఎక్కువ కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. మొత్తానికి రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత ఆ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టారు.
