Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!

Sharad Pawar Modi

Sharad Pawar Modi

Sharad Pawar: దేశ రాజకీయాల్లో ఇప్పుడంతా డీలిమిటేషన్ అంశంపైనే చర్చ సాగుతోంది.. ఎన్డీఏ మినహాయిస్తే ఇంకా ఏ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయనే చర్చ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ముందు సాగుతోంది.. ఈ సమయంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ నేత జితేంద్ర అవ్హాద్ వెల్లడించారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్‌ను శుక్రవారం కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. డీలిమిటేషన్ రాజ్యాంగపరమైన అవసరమని, ఈ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌పై జితేంద్ర అవ్హాద్ ఏమన్నారంటే?
శరద్ పవార్‌తో జరిగిన చర్చ పార్టీ అధికారిక వైఖరికి సంబంధించినది కాదని అవ్హాద్ వివరించారు. అయితే డీలిమిటేషన్ రాజ్యాంగపరమైన అవసరమని, అందుకే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులోని నిబంధనలను మాత్రం పూర్తిగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రియా సూలే తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇక, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించిన అవ్హాద్.. ఆయనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చని అన్నారు. 1986 నుంచి తాను శరద్ పవార్ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నానని, పవార్ నిర్ణయాలే తమకు అంతిమమని వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వాలంటే మూడు షరతులు!
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే గతంలో మూడు కీలక షరతులను ప్రతిపాదించారు. మొదటిది.. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి. రెండోది.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ఏకరీతిలో 50 శాతం పెంచాలి. మూడోది.. నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ణయించే డీలిమిటేషన్ కమిషన్‌లో ప్రతిపక్ష పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ మూడు అంశాలను బిల్లులో పొందుపరిస్తే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రియా సూలే గతంలో స్పష్టం చేశారు. అయితే, కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ, పార్లమెంట్ స్థానాల పెంపుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ప్రకటన ప్రతిపక్షాల మధ్య చర్చనీయాంశంగా మారింది.

ఇండియా కూటమి సమావేశానికి ఎన్సీపీ హాజరు!
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి శనివారం సమావేశం కానుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి తమ పార్టీ తరఫున నేతలు హాజరవుతారని జితేంద్ర అవ్హాద్ స్పష్టం చేశారు. అయితే శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి కారణంగా సుప్రియా సూలే మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ఎంపీలు సమావేశానికి హాజరవుతారని సమాచారం. మరోవైపు, నవంబర్ 30 నుంచి లోక్‌సభలో జరిగే ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎన్సీపీ (ఎస్పీ) తన ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఆ పార్టీకి రాజ్యసభలో ఒక సభ్యుడు ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ, బిల్లులోని పూర్తి నిబంధనలను పరిశీలించిన తర్వాతే తుది వైఖరిని స్పష్టం చేయనుంది. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్సీపీ (ఎస్పీ) అనుసరించే వైఖరిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది..