NTV Telugu Site icon

NCP Crisis: పవార్ వర్సెస్ పవార్.. పోటాపోటీగా విప్ జారీ చేసిన రెండు వర్గాలు..

Ncp Crisis

Ncp Crisis

NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రాజకీయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా వ్యవహారం నడుస్తోంది. ఎన్సీపీ పార్టీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. అజిత్ పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. బీజేపీ-షిండే ప్రభుత్వంలో చేరారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మరో 8మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు.

Read Also: Pedda Amberpet: మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా

ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఈ రోజు సమావేశాలకు పిలుపునిచ్చాయి. ఇరు పక్షాలు సమావేశాలకు హాజరుకావాలని విప్ జారీ చేశాయి. శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని వైబి చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం 1 గంటలకు సమావేశానికి పిలుపునిచ్చింది, అజిత్ పవార్ బృందం ఉదయం 11 గంటలకు సబర్బన్ బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ (MET) ప్రాంగణంలో సమావేశమవుతుంది. శరద్ పవార్ వర్గానికి చీఫ్ విప్‌గా పనిచేస్తున్న జితేంద్ర అవద్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్‌లను సమావేశానికి హాజరు కావాలని కోరారు. మరోవైపు అజిత్ పవార్ వర్గానికి చెందిన విప్ అనిత్ పాటిల్ కూడా అందరూ హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఈ సమావేశాల తర్వాత ఏ వర్గానికి ఎంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మహరాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజిత్ పవార్ తనకు మొత్తం 40 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. అయితే శరద్ పవార్ వర్గం మాత్రం అజిత్ పవార్ వర్గానికి కేవలం 13 మంది ఎమ్మెల్యే మద్దతు మాత్రమే ఉందని చెబుతోంది. ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనలను తప్పించుకోవాలంటే అజిత్ పవార్ కి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అజిత్ పవార్ వర్గానికి 36 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేఖపై సంతకం చేశారని వాదిస్తుండగా.. బీజేపీ అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా మద్దతు ఉందని వ్యాఖ్యానిస్తోంది. శరద్ పవార్ ఎంతో నమ్మకంగా ఉన్న 8 మంది ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు.